వ్యాక్సిన్‌ రెండు డోసులు సరిపోదా?

తాజా వార్తలు

Published : 18/04/2021 17:40 IST

వ్యాక్సిన్‌ రెండు డోసులు సరిపోదా?

న్యూదిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. రెండు సార్లు వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు కూడా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోలిస్తే, తీసుకోని వారి ఆరోగ్యంపై ప్రభావం ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలో మూడో డోస్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకోవాలా? అన్న ప్రశ్నపై ఆరోగ్య నిపుణులు చర్చ జరుపుతున్నారు. మూడోసారి వ్యాక్సిన్‌ తీసుకుంటే కొవిడ్‌-19ను సమర్థంగా నియంత్రించవచ్చన్న అంశంపై పూర్తి అధ్యయనం జరపాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఫైజర్‌, మోడెర్నా టీకాలు తీసుకున్న వారికి ఈ ఏడాదిలో మరో బూస్టర్‌ అవసరమని కంపెనీలు ప్రకటించాయి. అంతేకాదు, కరోనాపై సమర్థంగా పనిచేసే వ్యాక్సిన్‌ వచ్చే వరకూ ఏటా ఒక డోస్‌ తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)సూచన మేరకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను కొందరు వాలంటీర్లకు మూడో డోస్‌ కింద ఇచ్చారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కొవిషీల్డ్‌/కొవాగ్జిన్‌లు ఎనిమిది వారాల విరామంతో రెండు డోస్‌లు ఇస్తున్నారు. ఆరు నెలల తర్వాత మరో బూస్టర్‌ డోస్‌ అవసరమని భారత్‌ బయోటెక్‌ ప్రతిపాదించింది. అయితే, మూడో డోస్‌ తీసుకుంటే కరోనాను సమర్థంగా ఎదుర్కొంటామా? అన్నదానిపై మరింత అధ్యయనం చేయాల్సిందని నిపుణులు చెబుతున్నారు.

‘రెండు డోస్‌లు తీసుకున్న తర్వాత మూడో డోస్‌ ఇవ్వాలని ఔషధ తయారీ సంస్థలు భావిస్తే, ఇమ్యూనోలాజికల్‌ మెమొరీ డేటాపై ఆధారపడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు డోస్‌ల తర్వాత శరీరంలో యాంటీబాడీల పరిస్థితి ఏంటన్నదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఔషధ సంస్థలు మూడో డోస్‌ తీసుకోవాలని సూచించడం నన్ను ఆశ్చర్య పరిచింది. డిసెంబరు 2019లో కరోనా భారత్‌లో ప్రవేశించింది. 2020 ఏప్రిల్‌-ఆగస్టు మధ్య వాక్సిన్‌ తయారీని మొదలు పెట్టారు. కాబట్టి మన దగ్గర సరైన గణాంకాలు లేవు. పూర్తి అధ్యయనం చేయడకుండా మూడో డోస్‌ ఇవ్వడంపై అధ్యయనం జరగాల్సి వుంది. అందుకు ఇంకా సమయం ఉంది’’ అని ఐసీఎంఆర్‌ నేషనల్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ సమిరన్‌ పండా అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని