కరోనా: వణికించి.. విరామమిచ్చి.. తిరగబడి

తాజా వార్తలు

Updated : 02/04/2021 13:04 IST

కరోనా: వణికించి.. విరామమిచ్చి.. తిరగబడి

గతేడాది భారత్‌లో ప్రవేశించిన కరోనా వైరస్‌ శరవేగంగా తన ప్రతాపం చూపించింది. ఆరు నెలలు తిరిగే సరికి ఉగ్రరూపం దాల్చింది. లక్షల కొద్దీ కేసులు.. వేలకొద్దీ మరణాలతో విరుచుకుపడింది. అయితే ఆ తర్వాత నుంచి కాస్త తగ్గినట్లే కన్పించిన ఈ మాయదారి మహమ్మారి తాజాగా మళ్లీ కొమ్ములెత్తుతోంది. ఇటీవలి కాలంలో మళ్లీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆరు నెలల తర్వాత రోజువారీ కేసులు మళ్లీ 80వేలు దాటడం కలవరానికి గురిచేస్తోంది. అయితే కరోనా తిరగబడుతున్నప్పటికీ వ్యాక్సిన్‌ పంపిణీ కాస్త ఊరటనిస్తోంది. 

అప్పుడు.. లక్షకు చేరువలో..

24 గంటల వ్యవధిలో దేశంలో 81,466 మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. ఒక రోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదుకావడం గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ ఇప్పుడే. సరిగ్గా ఆరు నెలల క్రితం అక్టోబరు 2న 81,484 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే భారత్‌లో అత్యధిక రోజువారీ కేసులు నమోదైంది మాత్రం గతేడాది సెప్టెంబరులోనే. అప్పుడు కేసుల సంఖ్య ఏకంగా లక్షకు చేరువై.. ప్రజలను తీవ్ర భయాందోళనలోకి నెట్టేసింది. గతేడాది సెప్టెంబరు 16న దేశంలో 97,894 వైరస్‌ పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అంతకు ఐదు రోజుల క్రితం అంటే.. సెప్టెంబరు 11న 97,654 కేసులు వచ్చాయి. 

అక్టోబరు నుంచి తగ్గుతూ వచ్చి..

గతేడాది సెప్టెంబరులో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆ నెలలో ఏకంగా 11 సార్లు రోజువారీ కేసులు 90వేల పైనే నమోదయ్యాయి. ఆ తర్వాత అక్టోబరు నుంచి వైరస్‌ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. మాస్క్‌లు, సామాజిక దూరం వంటి నిబంధనలతో పాటు జనవరి నుంచి వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి రావడంతో కొత్త కేసుల సంఖ్య నానాటికీ పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న రోజువారీ పాజిటివ్‌ల సంఖ్య ఏకంగా 10వేల దిగువకు చేరింది. ఆ రోజున 9,139 కొత్త కేసులు నమోదయ్యాయి. 

వ్యాక్సిన్ల రాకతో.. పెరిగిన నిర్లక్ష్యం

ఈ ఏడాది ఆరంభంలో కరోనాను తరిమికొట్టే రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. జనవరి 16 నుంచి దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుపెట్టారు. అయితే టీకాల రాకతో ప్రజల్లో భరోసాతో పాటు నిర్లక్ష్యం కూడా పెరిగింది. కరోనా నిబంధనలను పట్టించుకోకపోవడంతో ఇటీవల మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ మళ్లీ విజృంభించింది. దీంతో గత నెలన్నర రోజుల నుంచి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే పరిస్థితి ఆందోళనకర రీతిలో ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో అధికశాతం ఆ ఒక్కరాష్ట్రంలోనే ఉంటున్నాయి. 

ఊరటనిస్తున్న రికవరీలు..

అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీలు కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటుండటం ఊరటనిస్తోంది. గతేడాది సెప్టెంబరు నాటి పరిస్థితిని చూస్తే.. ఆ నెలలో రోజువారీ మరణాలు వెయ్యికి పైనే నమోదయ్యాయి. అత్యధికంగా గతేడాది సెప్టెంబర్‌15న 1,283 మంది బలయ్యారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరణాల సంఖ్య తక్కువగానే ఉంటోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 469 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 

దవాయి బీ.. కరాయి బీ.. 

కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌. ప్రస్తుతం మన దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి 45ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందిస్తోంది. అయితే వ్యాక్సిన్‌తో పాటు జాగ్రత్తలు కూడా అవసరమే అని ప్రభుత్వం, నిపుణులు చెబుతున్నారు. టీకాలు తీసుకున్నప్పటికీ మాస్క్‌లు, ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నియమాలను మర్చిపోవద్దని సూచిస్తున్నారు. లేదంటే పరిస్థితి చేయి దాటే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. 

కేసుల పెరుగుదల ఇలా..

దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.23కోట్లు దాటింది. వీరిలో 1.15కోట్ల మంది వైరస్‌ను జయించగా.. ప్రస్తుతం 6.14లక్షల క్రియాశీల కేసులున్నాయి. అయితే దేశంలో కరోనా కేసుల పెరుగుదలను ఒకసారి పరిశీలిస్తే..

* ఆగస్టు 7, 2020 - 20లక్షలు

* ఆగస్టు 23, 2020 - 30లక్షలు

సెప్టెంబరు 5, 2020 - 40 లక్షలు

* సెప్టెంబరు 16, 2020 - 50లక్షలు 

* సెప్టెంబరు 28, 2020 - 60 లక్షలు

* అక్టోబరు 11, 2020 - 70 లక్షలు 

* అక్టోబరు 29, 2020 - 80 లక్షలు

* నవంబరు 20, 2020 - 90 లక్షలు

* డిసెంబరు 19, 2020 - కోటి

* మార్చి 28, 2021 - 1.20 కోట్లు 

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని