టీకా తీసుకున్నవారిలో మ్యాగ్నటిక్‌ పవర్స్‌.. నిజమెంత?
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 20:36 IST

టీకా తీసుకున్నవారిలో మ్యాగ్నటిక్‌ పవర్స్‌.. నిజమెంత?

అలాంటి వార్తలు నిరాధారమన్న కేంద్రం

దిల్లీ: కొవిడ్‌ టీకా తీసుకున్నాక తమలో అయస్కాంత శక్తులు ఉద్భవిస్తున్నాయంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల దిల్లీ, నాసిక్‌కు చెందిన వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయగా..  తాజాగా ఝార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన తాహిర్‌ అన్సారీ అనే మరో వ్యక్తి కూడా టీకా తీసుకున్నాక తన శరీరంలో అయస్కాంత శక్తులు కనిపించినట్టు చెప్పాడు. ‘‘శనివారం నేను వ్యాక్సిన్‌ వేయించుకున్నా. నాసిక్‌లో ఓ వ్యక్తి అయస్కాంత శక్తులు వచ్చినట్టు చెప్పిన వీడియో చూసి ఓసారి టెస్ట్‌ చేద్దామని నిర్ణయించుకున్నా. అయితే, నా శరీరంపై స్పూన్‌లు‌, ఫోర్క్‌లు‌, నాణేలు అతుక్కోవడం చూసి ఆశ్చర్యపోయా’’ అని అతడు చెప్పినట్టు ‘ఇండియా టుడే’ పేర్కొంది.

దీనిపై సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అయన ఇంటికి చేరుకొని పరీక్షలు చేశారు. అనంతరం వైద్యుడు డాక్టర్‌ ఎస్‌కే వేద్‌ రాజన్‌ మాట్లాడుతూ.. తాహిర్‌ శరీరంలో అయస్కాంత కేంద్రమేమీ లేదన్నారు. అయితే, ఆయన్ను 48గంటల పాటు ఇంటివద్దే ఉండాలని సూచించినట్టు తెలిపారు. తాహిర్‌ ఆరోగ్యాన్ని మానిటర్‌ చేయాలని వైద్య సిబ్బందికి సూచించామని వివరించారు. ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన అరవింద్‌ సోనార్‌ (71) అనే వ్యక్తి తాను రెండో డోసు తీసుకున్నాక అయస్కాంత శక్తులు వచ్చాయంటూ చేసిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 

కేంద్రం ఏమంటోంది?

ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని, లోహ ఆధారిత పదార్థాలేమీ వాటిలో లేవని స్పష్టం చేసింది. వ్యాక్సిన్లు వేయించుకుంటే మ్యాగ్నటిక్‌ సూపర్‌ పవర్స్‌ వస్తున్నాయన్న సమాచారం పూర్తిగా నిరాధారమైందని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ కొట్టిపారేసింది. మానవ శరీరంలో మ్యాగ్నటిక్‌ ప్రతిచర్యకు కొవిడ్‌ వ్యాక్సిన్లు కారణం కాదని తెలిపింది. కొవిడ్‌ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని స్పష్టంచేసింది. కరోనాపై పోరాటానికి చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసింది.

అమెరికాలో అభాసుపాలైన ఓ నర్సు..

మరోవైపు, ఈ తరహా ఘటనలు మన దేశంలోనే కాదు.. అమెరికాలోనూ ఇటీవల జరిగాయి. వ్యాక్సిన్‌ వల్ల అయస్కాంత శక్తి వస్తోందంటూ నిరూపించాలని ప్రయత్నించి ఒహైయోకి చెందిన ఓ నర్సు అభాసుపాలైంది. వ్యాక్సిన్​కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. తనలో అయస్కాంత శక్తులు అభివృద్ధి చెందినట్లు నిరూపించేందుకు ఆమె విఫలయత్నం చేసింది. ఒహైయో లెజిస్లేటివ్‌ కమిటీ ముందు ప్రదర్శన చేసి చూపించాలనుకుంది. ఈ క్రమంలో తన శరీరానికి పిన్నులు అంటుకుంటున్నాయని చూపించే ప్రయత్నం బెడిసికొట్టిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడంతో ఆమె విమర్శల పాలైంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని