కుంభమేళాలో 30మంది సాధువులకు కరోనా 

తాజా వార్తలు

Updated : 16/04/2021 13:45 IST

కుంభమేళాలో 30మంది సాధువులకు కరోనా 

హరిద్వార్‌: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న పవిత్ర కుంభమేళాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటికే అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. తాజాగా కుంభమేళాలో పాల్గొన్న 30 మంది నాగసాధువులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆల్‌ ఇండియా అఖాడా పరిషత్‌ నాయకుడు మహంత్‌ నరేంద్ర గిరి కూడా కరోనాతో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేరారు. 

‘‘ఇప్పటివరకు 30 మంది సాధువులకు కరోనా సోకింది. నిరంజిని, జునా సహా దాదాపు అన్ని అఖాడాలోని సాధువులు వైరస్‌బారిన పడ్డారు. మిగతావారికి కూడా పరీక్షలు చేస్తున్నాం’’ అని హరిద్వార్‌ చీఫ్‌ మెడికల్‌ అధికారి ఎస్‌కే ఝా తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో నిరంజిని అఖాడా సాధువుల బృందం కుంభమేళాను వీడేందుకు సిద్ధమైంది. ‘‘కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మా కుంభమేళాను ముగిస్తున్నాం. మా ప్రధాన రాజస్నానం పూర్తయ్యింది. మా అఖాడాలో చాలా మందికి కొవిడ్‌ లక్షణాలు కన్పిస్తున్నాయి. అందుకే శనివారం మేమంతా హరిద్వార్‌ను వీడుతున్నాం’’ అని ఈ అఖాడా సెక్రటరీ రవీంద్ర పూరి మీడియాకు తెలిపారు. 

ప్రముఖ సాధువు కన్నుమూత

ఇదిలా ఉండగా.. మహా నిర్వాణి అఖాడా హెడ్‌, ప్రముఖ సాధువు స్వామి కపిల్‌ దేవ్‌ కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చికిత్స నిమిత్తం రిషికేష్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ గురువారం తుదిశ్వాస విడిచారు. 

కుంభమేళా ప్రాంతంలో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఏప్రిల్‌ 10 నుంచి 15 వరకు 2,100 మందికి పైగా భక్తులు వైరస్‌ బారినపడ్డారు. ఇటీవల ఏప్రిల్‌ 12, 14న షాహీ స్నాన్‌(రాజస్నానాలు) జరిగాయి. ఆ రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు గంగానదీలో పవిత్రస్నానాలు ఆచరించారు. కాగా.. కొవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ కుంభమేళాను ఇంకా ముగించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని