యాంటీబాడీలను ఏమార్చేలా కరోనాలో మార్పులు!

తాజా వార్తలు

Published : 05/02/2021 14:40 IST

యాంటీబాడీలను ఏమార్చేలా కరోనాలో మార్పులు!

ఉత్పరివర్తన తీరును ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు 

న్యూయార్క్‌: కరోనాలో జరుగుతున్న మార్పు (ఉత్పరివర్తన)ల్లో ఒక నిర్దిష్ట పోకడను శాస్త్రవేత్తలు గమనించారు. దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీలను ఏమార్చే సామర్థ్యం ఆ వైరస్‌కు వస్తుందని పేర్కొన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాలను భవిష్యత్‌లో ఈ వైరస్‌ నీరుగార్చే ప్రమాదం ఉందా అన్నది గుర్తించేందుకు ఈ ఆవిష్కారం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కరోనా వైరస్‌పై ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ జన్యుక్రమంలో కొన్ని తొలగింపులు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 1.5 లక్షల జన్యుక్రమాలను విశ్లేషించి, ఈ మేరకు తేల్చారు. ఇలాంటి ఉత్పరివర్తనలు కలిగిన వైరస్‌ రకాలను ప్రస్తుత యాంటీబాడీలు నిలువరించలేవని పేర్కొన్నారు. దీర్ఘకాలం కొవిడ్‌తో బాధపడ్డవారిలో ఇలాంటి రకాలను 9 సందర్భాల్లో గుర్తించినట్లు చెప్పారు. రోగనిరోధక శక్తి పటిష్ఠంగా లేని ఒక వ్యక్తిలో తొలుత దీన్ని కనుగొన్నామని తెలిపారు. అతడు కరోనా వైరస్‌తో 74 రోజులు పాటు ఇబ్బందిపడి చనిపోయాడని పేర్కొన్నారు. రోగ నిరోధక వ్యవస్థకు కరోనా వైరస్‌కు మధ్య ఇంత సుదీర్ఘకాలం జరిగే పోరాటం.. ఇలాంటి ఉత్పరివర్తనల ఆవిర్భావానికి కారణమవుతుందని చెప్పారు. అయితే యాంటీబాడీల రక్షణను ఇవి ఎంత మేర క్షీణింపచేస్తాయన్నది ఇంకా నిర్ధారణ కాలేదని పరిశోధనలో పాల్గొన్న కెవిన్‌ మెక్‌కార్తి చెప్పారు. అయితే భవిష్యత్‌లో ఏదో ఒక సమయంలో కొవిడ్‌ టీకాల్లో మార్పులను చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

ఇవీ చదవండి..
భారత్‌లో వెనక్కి తగ్గిన ఫైజర్!

భారత్‌లో క్రియాశీల రేటు..1.40 శాతం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని