కొన్ని చోట్ల గాలి ద్వారానూ కరోనా!
close

తాజా వార్తలు

Updated : 16/04/2021 19:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొన్ని చోట్ల గాలి ద్వారానూ కరోనా!

వెల్లడిస్తూ.. సూచనలు చేసిన ‘ది లాన్సెట్‌’ జర్నల్‌

వాషింగ్టన్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ గాలి ద్వారానూ వ్యాపిస్తున్నట్లు ఇప్పటికే ప్రాథమిక అధ్యయనాలు వెల్లడించాయి. అయినా దీన్ని నిర్ధారించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి బలమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తాజాగా ఈ నివేదిక ప్రముఖ అంతర్జాతీయ సైన్స్‌ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’లో ప్రచురితమైంది.

కరోనా వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌-19కు కారణమైన ‘సార్స్‌-కోవ్‌-2’ వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న నివేదికలు ఆందోళనకు గురిచేశాయి. వీటిని నిర్ధారించేందుకు బ్రిటన్‌, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం నడుం బిగించింది. చివరకు గాలి ద్వారానూ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని తేల్చే పది విషయాలను నివేదించింది.

సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్లు..

కరోనా వైరస్‌ వ్యాప్తికి ముఖ్యంగా సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్లు కారణమవుతున్నాయని తాజా అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్‌ సోకిన ఓ వ్యక్తి నుంచి 53 మందికి సోకిన ఓ ఘటనను నివేదికలో ఉదహరించారు. వైరస్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం లేదా అతను తాకిన ప్రదేశాలు, వస్తువులను తాకకుండానే వారందరికీ వైరస్‌ సోకిన విషయాన్ని గుర్తుచేశారు. వారందరిపై జరిపిన అధ్యయనంలోనూ ఇదే విషయం తేలిందని నిపుణులు స్పష్టంచేశారు. గాలిద్వారా వైరస్‌ వ్యాప్తి చెందడమే ఇలాంటి ఘటనకు కారణమని అభిప్రాయపడ్డారు.

లక్షణాలు లేని వారినుంచీ..!

బాహ్యప్రదేశాల్లో కంటే ఇండోర్‌ ప్రదేశాల్లోనే వైరస్‌ వ్యాప్తి అత్యధికంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఇండోర్‌ ప్రదేశాల్లో సరైన వెంటిలేషన్‌ ఉన్నట్లయితే వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు. అసింప్టమెటిక్‌(లక్షణాలు లేని)వ్యక్తుల నుంచి కరోనా వైరస్‌ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 40శాతం దగ్గు, తుమ్ము వంటి లక్షణాలు లేనివారి నుంచే ఇతరులకు సోకుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ వ్యాపించడానికి ఈ నిశ్శబ్ద వ్యాప్తే ఎంతో కీలకంగా వ్యవహరించిందని.. గాలిలో వైరస్‌ వ్యాపిస్తుందనడానికి ఇది కూడా ప్రధాన కారణంగా కనిపించిందని నిపుణులు వెల్లడించారు. ఒకరినొకరు సన్నిహితంగా మెలగకున్నా.. హోటళ్లలో పక్క గదుల్లో ఉన్న వ్యక్తులకు వైరస్‌ సోకడాన్ని కూడా నిపుణులు ఉదహరించారు.

అయితే, తొందరగా ఉపరితలంపై పడిపోయే పెద్ద బిందువుల నుంచి వైరస్‌ తేలికగా గాలిలో ఎలా ప్రసరిస్తుందని శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో రుజువు చేయలేకపోయారు. అయినప్పటికీ డైనమిక్స్‌ ఆఫ్‌ ఫ్లుయిడ్‌ ఫ్లోస్, బ్రతికున్న వైరస్‌ను వేరుచేసి జరిపిన పలు అధ్యయనాల నివేదికలను పూర్తిగా విశ్లేషించామని పరిశోధనకు నేతృత్వం వహించిన నిపుణడు గ్రీన్‌హాల్గ్‌ పేర్కొన్నారు. వీటిలో కొన్ని గాలిలో వ్యాప్తిని బలహీనమైనవిగా అంచనా వేసినప్పటికీ.. ఇది సాధ్యమనడానికి బలమైన ఆధారాలెన్నో ఉన్నాయని స్పష్టంచేశారు.

అప్రమత్తం కావాల్సిందే..

గాలిలో వైరస్ వ్యాపించడం తీవ్రమైనదని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టంచేసింది. వైరస్‌ సోకిన వ్యక్తి శ్వాస (ఉచ్ఛ్వాసము) వల్ల వైరస్‌ గాలిలోకి వెళ్లడం.. తద్వారా ఇతరులు ఆ గాలి పీల్చినప్పుడు వైరస్ వారికి ‌సోకుతుంది. ఇదే విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లోనూ రుజువైందని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన ఏరోసల్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ కింబర్లీ ప్రాథర్‌ స్పష్టం చేశారు. గాలి ద్వారానూ కరోనా వ్యాపించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ దిగువ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని పరిశోధకులు పేర్కొన్నారు.

* గాలిలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి. ఎయిర్‌ ఫిల్టర్లు ఏర్పాటు చేసుకోవాలి.

* ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా చూసుకోవాలి.

* ఇండోర్‌ ప్రాంతాల్లో తక్కువ సమయం ఉండేలా చూసుకోవాలి.

* ఇండోర్‌లో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలి. 

* సాధారణ సమయాల్లోనూ నాణ్యమైన మాస్కులు వాడాలి.

* కరోనా రోగులకు చికిత్స చేసే సమయంలో వైద్య సిబ్బంది పీపీఈ కిట్లను ధరించాలి.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థతో పాటు అంతర్జాతీయ ఆరోగ్య విభాగాలు నూతన మార్గదర్శకాల ద్వారా వైరస్‌ కట్టడికి అత్యవసర చర్యలు తీసుకోవాలని అధ్యయన బృందం సూచించింది. ఇక, గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఇదివరకే వెల్లడించింది. వీటిపై భారత్‌లో పరిశోధన చేస్తోన్న సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ (సీసీఎంబీ) కూడా ఇండోర్‌ ప్రాంతాల్లో గాలిలో వైరస్‌ వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేసిన విషయం విదితమే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని