
తాజా వార్తలు
భారత్‌లో 75% యాక్టివ్ కేసులు అక్కడే..
దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. దేశంలో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 75శాతం కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై వైద్య శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు మధ్యాహ్నం 1గంట వరకు దేశ వ్యాప్తంగా 1,17,54,788 డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంట్లో తొలి డోసు 1,04,93,205మందికి పంపిణీ చేయగా.. 12,61,583 మందికి రెండో డోసు వేశాం. 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 75శాతానికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీ జరిగింది. 9 రాష్ట్రాల్లో 60శాతం కరోనా యోధులకు టీకాలు ఇచ్చాం.’’ అన్నారు.
‘‘దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1.5లక్షల కన్నా తక్కువగానే ఉంది. గత వారం రోజుల్లో సగటున 92 చొప్పున మరణాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కేరళలో 55,752 యాక్టివ్ కేసులు (37.85శాతం) ఉండగా.. మహారాష్ట్రలో 54,306 (36.87శాతం) కేసులు ఉన్నాయి. అలాగే, కర్ణాటకలో 4.13శాతం, తమిళనాడులో 2.78శాతం చొప్పున యాక్టివ్ కేసులు ఉండగా.. దేశంలోని మిగతా చోట్లన్నీ కలిపి 18.37శాతంగా ఉన్నాయి’’ అని అధికారులు వివరించారు.
మరోవైపు, కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌లలో పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర బృందాలను పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, ఇప్పటివరకు 187 మందిలో యూకే స్ట్రెయిన్‌ను గుర్తించినట్టు నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. దక్షిణాఫ్రికా రకం వైరస్ ఆరుగురిలో, ఒకరిలో బ్రెజిల్ స్ట్రెయిన్‌ను గుర్తించినట్టు చెప్పారు.