మా టీకా సురక్షితమే.. ఆస్ట్రాజెనెకా

తాజా వార్తలు

Published : 15/03/2021 19:15 IST

మా టీకా సురక్షితమే.. ఆస్ట్రాజెనెకా

దిల్లీ: వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఖండించింది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని యూరప్‌లోని కొన్ని దేశాలు తాత్కాలికంగా నిలిపి వేస్తుండటంపై సంస్థ సోమవారం స్పందించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి రక్తంలో సమస్యలు ఏర్పడటానికి టీకాకు ఎటువంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ వల్ల రక్తం గడ్డకడుతోందనడానికి రుజువులు లేవని నిపుణులు తేల్చి చెప్పినట్లు ప్రకటించింది. దీంతో తమ వ్యాక్సిన్‌ అందరికీ సురక్షితమని సంస్థ వివరించింది.

‘ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ శాస్త్రీయంగా నిరూపితమైంది. భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చి.. టీకాను తయారు చేశాం. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్‌ తయారీని పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటి వరకూ యూరప్‌, యూకేలలో సుమారు 17 మిలియన్‌ల మంది టీకా తీసుకున్నారు. ఇక ముందు కూడా ఎటువంటి సందేహం లేకుండా వ్యాక్సిన్‌ పొందవచ్చు. సాధారణ సమయంలోనూ రక్తంలో సమస్యలు ఏర్పడతాయి. వాటిని వ్యాక్సిన్‌తో ముడిపెట్టవద్దు. వ్యాక్సినేషన్‌ అనంతరం చాలా మందిలో రక్తం గడ్డకడుతోందని వస్తోన్న ఆరోపణలకు రుజువులు లేవు. నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తున్నాం. ఈ మేరకు టీకా నాణ్యతపై 20 లేబొరేటరీలలో 60 పరీక్షలు( క్వాలిటీ టెస్ట్‌లు) చేశారు’ అని ఆస్ట్రాజెనెకా చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ అన్‌ టేలర్‌ చెప్పారు. వ్యాక్సిన్ క్వాలిటీ టెస్ట్‌ల వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లలో పొందుపరుస్తామని సంస్థ తెలిపింది. భారత్‌లో ఆస్ట్రాజెనెకా టీకాను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను విజయవంతంగా పంపిణీ చేస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని