ఆందోళన కల్గిస్తోన్న టీకా కొరత

తాజా వార్తలు

Updated : 07/07/2021 15:06 IST

ఆందోళన కల్గిస్తోన్న టీకా కొరత

ముంబయిలో పంపిణీకి అంతరాయం

ముంబయి, ఇండోర్‌: కరోనా విజృంభిస్తున్న వేళ టీకాల కొరత వేధిస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో పలు కేంద్రాల్లో టీకాలు లేవని బోర్డులు ఏర్పాటు కావడం.. రాజస్థాన్‌లో రెండురోజులకే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం... టీకా అందలేదని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ ప్రజలు ఆందోళనకు దిగడం  పరిస్థితికి అద్దం పడుతోంది. సరిపడా టీకాలు లేక ముంబయిలోని పలు కేంద్రాల్లో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. బీకేసీలోని అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కేంద్రం సహా అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ముంబయిలో ఉన్న 120 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 75 కేంద్రాలను టీకాల కొరత కారణంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పరిస్థితి తలెత్తింది. కరోనా టీకాల కొరత ఉందని ఇప్పటికే కేంద్రంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వస్తోంది. ముంబయిలో టీకా పంపిణీకి కొత్తగా 1.80 లక్షల డోసులను కేంద్రం శుక్రవారం అందించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

30 లక్షల డోసులు పంపండి: రాజస్థాన్‌ సీఎం

వచ్చే రెండు రోజులకు సరిపడా వ్యాక్సిన్‌ నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. తక్షణం 30 లక్షల డోసుల టీకాలను పంపేలా చర్యలు తీసుకోవాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. 

ఇండోర్‌లో ప్రజల నిరసన

టీకా అందలేదని ఆగ్రహిస్తూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. టీకా కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి వరుసలో నిల్చున్నా.. చివరికి తమ వంతు వచ్చేసరికి టీకా అందుబాటులో లేదంటూ సిబ్బంది బోర్డు పెట్టారని ప్రజలు పేర్కొన్నారు. 

కరోనా అంతానికి ఉజ్జయినిలో యజ్ఞం 

ఉజ్జయిని: కరోనా మహమ్మారి అంతం కావాలని కోరుతూ.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయంలో యజ్ఞం నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ యజ్ఞం 11 రోజుల పాటు జరుగుతుందని ఆలయ కమిటీ  వెల్లడించింది. కరోనా బారిన పడకుండా ప్రజలు క్షేమంగా ఉండాలని యజ్ఞానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపింది.

హరియాణా, బిహార్‌లో పాఠశాలల మూసివేత

చండీగఢ్, పట్నా, జైపుర్‌: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. తాజాగా హరియాణా, బిహార్‌ రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలుకు ఉపక్రమించాయి. ఇందులో భాగంగా హరియాణా ప్రభుత్వం 8వ తరగతి వరకు పాఠశాలలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రకటించారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. 

సాయంత్రం 7గంటల కల్లా దుకాణాల బంద్‌

కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నట్లు బిహార్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 18 వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 31 వరకు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని.. సాయంత్రం 7 గంటల కల్లా దుకాణాలను  మూసివేయాలని స్పష్టం చేసింది. అన్ని పార్టీల నేతలతో శుక్రవారం ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు రాజస్థాన్‌లోని 10 నగరాల్లో రాత్రి కర్ఫ్యూను ఏప్రిల్‌ 30 తేదీ వరకు  పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని