Cyclone Yaas: 90 రైళ్లు రద్దు! 

తాజా వార్తలు

Updated : 24/05/2021 16:38 IST

Cyclone Yaas: 90 రైళ్లు రద్దు! 

కోల్‌కతా: ‘యస్‌’ తుపాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం తుపానుగా మారింది.  రానున్న 12గంటల్లో ఇది తీవ్ర తుపానుగా; తదుపరి 24గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రసుతం ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయం దిశగా 530 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ‘యస్‌’తుపాను.. ఈ నెల 26 ఉదయానికి  ఒడిశా - బెంగాల్‌ రాష్ట్రాల మధ్య తీరం తాకే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, ఈ నెల 26న మధ్యాహ్నానికి ‘యస్‌’ తుపాను ఒడిశాలోని పారాదీప్‌, బంగాల్‌లోని సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. 

90 రైళ్లు రద్దు
ఈ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో తూర్పు కోస్తా రైల్వేకీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రూట్లలో 90 రైళ్లను రద్దు చేసింది. తుపాను తీవ్రతను బట్టి ఈ సాయంత్రానికి మరో 10 రైళ్లను రద్దు చేసే అవకాశం ఉన్నట్టు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం నాటికి ‘యస్‌’ అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు భారత వాతావరణ శాఖ ప్రాంతీయ సైంటిస్ట్‌ ఉమా శంకర్‌ దాస్‌ తెలిపారు.  ఒడిశాలోని పారాదీప్‌, ధమ్రా తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీచేసినట్టు చెప్పారు. 

బలమైన గాలులు
ఈ తుపాను తీవ్రతతో కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్‌, బాలాసోర్‌, భద్రక్‌లలో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. తీరం తాకే సమయంలో గంటకు 150 నుంచి 160 కి.మీల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఒడిశాలోని పూరీ, కటక్‌, జైపూర్‌, మయూర్‌బంజ్‌లలో గాలులు గంటకు 120 నుంచి 130 వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

యస్‌ తుపాను ఒడిశా- బెంగాల్‌ తీర ప్రాంతాలైన పారాదీప్‌, సాగర్‌ దీవుల మధ్య ఈ నెల 26న తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 155 నుంచి 165 కి.మీల వేగంతో వీస్తాయని కోల్‌కతా ప్రాంతీయ వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ సంజీవ్‌ బందోపాధ్యాయ్‌ తెలిపారు. కోస్టల్‌ జిల్లాలైన పుర్బా, పశ్చిమ్‌ మేదినిపూర్‌, దక్షిణ, ఉత్తర 24 పరగణాస్‌తో పాటు హావ్‌డా, హుగ్లీ జిల్లాల్లోనే అనేక ప్రాంతాల్లో మే 25 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తాయని, రెండుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. 

ఒడిశాలో ఆ నాలుగు జిల్లాలపై తీవ్ర ప్రభావం
‘యస్‌’ ధాటికి ఒడిశాలోని నాలుగు కోస్టల్‌ జిల్లాలైన బాలాసోర్‌, భద్రక్‌, కేంద్రపర, జగత్‌సింగ్‌పూర్‌లు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు. తీవ్ర తుపాను సమయంలో గంటకు 120 నుంచి 165 కి.మీల వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

మరోవైపు, ఈ తుపాను తీవ్రతను ఎదుర్కొనేందుకు సన్నాహకాల్లో భాగంగావాయుసేన అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల కోసం 11 ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాప్ట్‌లతో పాటు మరో 25 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. ఐదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 99 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ  వెల్లడించారు. ఏపీలో 3 బృందాలను ఏర్పాటు చేయగా.. ఒడిశాలో 52, బెంగాల్‌లో 35, తమిళనాడులో 5, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 4 బృందాలను సహాయక చర్యల నిమిత్తం సిద్ధం చేసి ఉంచినట్టు తెలిపారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని