కొట్టుకుపోయిన నౌకలో 22 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 19/05/2021 17:12 IST

కొట్టుకుపోయిన నౌకలో 22 మంది మృతి

ముంబయి: ‘తౌక్టే’ తుపాను ధాటికి మహారాష్ట్రలోని బాంబే హై ప్రాంతంలో భారీ నౌకలు అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన ఘటనలో 22 మంది మృతదేహాలను నౌకాదళ సిబ్బంది బుధవారం గుర్తించి తీరానికి తీసుకొచ్చారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. 

తుపాను ఉద్ధృతికి బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద పి-305 అనే భారీ నౌక లంగరు ఊడిపోయి సముద్రంలో కొట్టుకుపోయింది. సమాచారమందుకున్న నేవీ హుటాహుటిన యుద్ధనౌకలను రంగంలోకి దింపి సహాయకచర్యలు చేపట్టింది. అయితే తీరానికి 35 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ నౌక నీటిలో మునిగిపోయి కన్పించింది. ప్రమాదం సమయంలో నౌకలో 261 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నౌక నుంచి ఇప్పటివరకు 185 మందిని నౌకదళ సహాయకసిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చగా.. ఇవాళ 22 మంది మృతదేహాలను గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించి, రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

అలల ధాటికి గత సోమవారం సాయంత్రం పీ-305 సహా మూడు బార్జ్‌లు (ఆఫ్‌షోర్‌ ఉద్యోగులకు నివాసంగా ఉపయోగపడుతున్న భారీ నౌక), ఒక ఆయిల్‌ రిగ్‌ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గాల్‌ కన్స్‌ట్రక్టర్‌కు చెందిన బార్జ్‌ కొట్టుకుపోగా.. అందులోని 137 మందిని నేవీ సిబ్బంది రక్షించారు. ఎస్‌ఎస్‌-3 అనే బార్జ్‌పై ఉన్న 196 మంది సిబ్బంది, ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌ రిగ్‌ ‘సాగర్‌భూషణ్‌’పై ఉన్న 101 మంది సురక్షితంగా ఉన్నట్లు నౌకాదళ అధికారులు వెల్లడించారు. సముద్రంలో నెలకొన్న కఠిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని