Cyclone Tauktae: అతిభీకర తుపానుగా తౌక్టే
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 10:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cyclone Tauktae: అతిభీకర తుపానుగా తౌక్టే

ముంబయి, గుజరాత్‌ అలర్ట్‌

ముంబయి: దేశ పశ్చిమ తీర రాష్ట్రాలను ‘తౌక్టే’ తుపాను గజగజ వణికిస్తోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన ఈ తుపాను ఇప్పుడు మరింత బలపడి ‘అతి భీకర తుపాను’గా మారినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్‌ వైపు పయనిస్తున్న తౌక్టే.. మంగళవారం ఉదయం నాటికి భావనగర్‌ జిల్లాలోని పోర్‌బందర్‌-మహువా ప్రాంతం వద్ద తీరాన్ని తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

ముంబయిలో భారీ వర్షాలు..

తుపాను ఉద్ధృతి దృష్ట్యా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నగరవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే ఉదయం కొంతసేపు వర్షం కురిసింది. దీంతో ముంబయి పశ్చిమ శివారుల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. తీరంలో నేవీ సిబ్బందిని అప్రమత్తం చేసింది. ముంబయితో పాటు ఠాణె, రాయ్‌గఢ్‌, పాల్ఘర్‌ జిల్లాల్లోనూ నేడు వర్షాలు పడే అవకాశమున్నట్లు  వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలను నిలిపివేశారు.

గుజరాత్‌లో అప్రమత్తం

అటు తుపాను ప్రభావంతో గుజరాత్‌ ప్రభుత్వం కూడా సహాయక బృందాలను సిద్ధం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే అవకాశమున్నందున కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గుజరాత్‌ వెళ్లాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి మొత్తం 126 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మూడు వాయుసేన విమానాల్లో బయల్దేరివెళ్లారు. మరోవైపు ఇప్పటికే గుజరాత్‌ తీరంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను తీరాన్ని తాకే పోర్‌బందర్‌, మహువా ప్రాంతాల మధ్య లోతట్టు ప్రాంతాల్లోని దాదాపు 25వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని