కొవాగ్జిన్‌‌ టీకా వినియోగానికి డీసీజీఐ అనుమతి!

తాజా వార్తలు

Updated : 03/01/2021 13:30 IST

కొవాగ్జిన్‌‌ టీకా వినియోగానికి డీసీజీఐ అనుమతి!

దిల్లీ: కొవిడ్‌ నిరోధానికి దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) వ్యాక్సిన్‌కు అనుమతినిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ టీకా భద్రమైనదని ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది. ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. అలాగే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోద ముద్ర వేసింది. కరోనా వైరస్‌ రూపాంతరం చెంది, కొత్త రకాలు విజృంభిస్తున్న తరుణంలో డీసీజీఐ నుంచి ఈ ప్రకటన రావడం ఊరట కల్పించే అంశం.

అంతకుముందు ఈ రెండు టీకాలకు అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) సిఫార్సు చేసింది. దానికనుగుణంగా నేడు డీసీజీఐ తుది అనుమతులను జారీ చేసింది. టీకా ఉత్పత్తి, పంపిణీ అంశాలపై ఇప్పటికే దృష్టి సారించినట్లు భారత్‌ బయోటెక్‌ ఇటీవల వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాకు బ్రిటన్‌ ప్రభుత్వం డిసెంబరు 30నే అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే సమాచారాన్ని సీరం సంస్థ.. నిపుణుల కమిటీకి సమర్పించింది. భారత్‌లోనూ ఈ సంస్థ 1600 మంది 18ఏళ్ల పైబడిన వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు డీసీజీఐ అనుమతినిచ్చింది. ఈ టీకా 70.42 శాతం సామర్థ్యం చూపినట్లు వివరించింది. భద్రత, రోగనిరోధకత పెంచే విషయంలో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు సీడీఎస్‌సీవో అంగీకరించిన నేపథ్యంలో దాని అత్యవసర వినియోగ అనుమతులకు మార్గం సుగమమైంది. ఇక కొవాగ్జిన్‌ విషయానికి వస్తే తొలి, రెండో దశలో 800 మందిపై ప్రయోగించినట్లు డీసీజీఐ తెలిపింది. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో మూడో దశ ప్రయోగాలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు దాదాపు 23 వేల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. కొవాగ్జిన్‌ టీకా భద్రమైనదని స్పష్టం చేసింది. 

* ఇక జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న టీకా తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ 1000 మందిపై కొనసాగుతున్నట్లు డీసీజీఐ వెల్లడించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్‌ సురక్షితమైనదేనని తెలిపింది. దీన్ని మూడు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. ఫేజ్‌-3 ట్రయల్స్‌కు అనుమతి కోరినట్లు తెలిపింది.  

సీరం శ్రమ ఫలించింది..

‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వ్యాక్సిన్‌ తయారీకి సీరం ఇన్‌స్టిట్యూట్‌ తీసుకున్న శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. భారత్‌లో తొలి కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ వినియోగానికి అనుమతి లభించింది. సురక్షితమైన, సమర్థవంతమైన ఈ టీకా రానున్న కొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది’’ - అదర్‌ పూనావాలా, సీఈవో సీరం ఇన్‌స్టిట్యూట్‌ 

కొవిడ్‌పై యుద్ధంలో కీలక మలుపు: మోదీ

భారత్‌లో కూడా టీకా అందుబాటులోకి రావడంతో కొవిడ్‌పై యద్ధం కీలక మలుపు తిరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సీరమ్‌ ఇనిస్టిట్యూట్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌కు డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేయడంపై ప్రధాని స్పందించారు. ఈ నిర్ణయం భారత్‌ ఆరోగ్యవంతమైన కొవిడ్‌ రహిత దేశంగా మార్చేందుకు సహకరిస్తుందని అన్నారు. దేశప్రజలకు, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కృషి చేసి శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనుమతులు వచ్చిన రెండు టీకాలు భారత్‌లోనే తయారు కావడం గర్వకారణమని ప్రధాని అన్నారు. భారత శాస్త్రవేత్తలు ఆత్మనిర్భర్‌ భారత్‌ కలను సాకారం చేసేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియజేసేందుకు ఈ ఘటన ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘‘మన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు మిగిలిన కరోనా వారియర్స్‌ దేశ కష్టకాలంలో చేసిన సేవలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎంతోమంది ప్రాణాలను కాపాడినందుకు మనందరం వారికి రుణపడి ఉంటాం’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

* భారత్‌లో కరోనా టీకాకు అనుమతులు రావడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్వాగతించింది. సంస్థ ఆగ్నేయాసియా వ్యవహారాల ప్రతినిధి పూనమ్‌ కేత్రపాల్‌ సింగ్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌పై ప్రపంచం చేస్తున్న పోరును ఈ చర్య మరింత వేగవంతం చేసిందని వ్యాఖ్యానించారు.   

డోస్‌ ఇలా..

డీసీజీఐ ప్రకారం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లను రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండు టీకాలకే ఇప్పటి వరకు అనుమతి లభించింది. వీటితోపాటు క్యాడిల్లా హెల్త్‌కేర్‌ కూడా టీకాను అభివృద్ధి చేస్తోంది. ఈ మూడు టీకాలను 2-8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయవచ్చు. 

కొవాగ్జిన్‌ టీకాను ఎలా అభివృద్ధి చేశారంటే..
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ అందించిన సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ స్ట్రెయిన్‌తో భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసింది. కొవాగ్జిన్‌.. ఇన్‌యాక్టివేటెడ్‌ రకానికి చెందిన టీకా. వ్యాధికారక సూక్ష్మజీవిని నిర్వీర్యం చేయడం ద్వారా వీటిని తయారుచేస్తారు. ఫలితంగా ఈ జీవికి పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు. అయితే టీకా తీసుకున్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ గుర్తించగలిగి, వాటిపై ప్రతిస్పందన చర్యలను కలిగించే స్థాయిలో అది ఉంటుంది. హెపటైటిస్‌-ఎ, ఇన్‌ఫ్లూయెంజా, పోలియో, రేబీస్‌ వంటి అనేక వ్యాధులకు ఇన్‌యాక్టివేటెడ్‌ టీకాలనే ఇస్తున్నారు.

అన్ని పరీక్షలు పూర్తయ్యాయా?

మొదటి, రెండో దశ క్లినికల్‌ ప్రయోగాలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 26వేల మందిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను భారత్‌ బయోటెక్‌ చేపట్టింది. 23వేల మంది వాలంటీర్ల ఎంపికను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల్లో ఈ టీకా ఎంతో సురక్షితమైనదిగా తేలింది. 65 శాతానికి పైగా సమర్థతను కనబరచింది. మూడో దశ పరీక్షల్లో సమర్థత ఇంకా పెరుగుతుందని కంపెనీ గతంలో వెల్లడించింది. ఈ టీకాను అన్ని వర్గాల వారూ తట్టుకోగలిగారు. ఎవరిలోనూ తీవ్ర దుష్ప్రభావాలు కలగలేదు.

కొవాగ్జిన్‌ తయారీ ఎప్పుడు? ఎన్ని డోసులు?

కొవాగ్జిన్‌ తయారీని ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ చేపట్టింది. కోటి డోసులు ఉత్పత్తయ్యాయి. తుది అనుమతి రాగానే వీటిని పంపిణీ చేస్తారు. కంపెనీకి ఏటా 30 కోట్ల డోసుల టీకా తయారీ సామర్థ్యం ఉంది. అవసరాన్ని బట్టి అదనపు సామర్థ్యాన్ని సమకూర్చుకోవటానికీ కంపెనీ సిద్ధంగా ఉంది.ఇంజెక్షన్‌ ద్వారా ఈ టీకాను ఇస్తారు. తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాలి. మొదటి డోసు ఇచ్చిన 28 రోజులకు రెండో డోసు ఇస్తారు.

ఎక్కడ తయారు చేస్తారు?

కొవాగ్జిన్‌ను హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌కు చెందిన యూనిట్లోని బీఎస్‌ఎల్‌(బయో సేఫ్టీ లెవల్‌)- 3 సదుపాయంలో తయారుచేస్తారు. ఇటువంటి అత్యంత భద్రమైన తయారీ యూనిట్‌ భారత్‌ బయోటెక్‌కు మాత్రమే ఉంది. చైనా, అమెరికాలోని కొన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడే బీఎస్‌ఎల్‌-3 తయారీ యూనిట్లు నిర్మించుకుంటున్నాయి.

కొత్త రకాలపైనా పనిచేస్తుందా?

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్తరకం కరోనా వైరస్‌లపైనా కొవాగ్జిన్‌ చక్కగా పనిచేస్తుందని ఇటు కంపెనీ వర్గాలు, అటు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని