Maharashtra: 23కు చేరిన మృతుల సంఖ్య..!

తాజా వార్తలు

Updated : 18/07/2021 12:45 IST

Maharashtra: 23కు చేరిన మృతుల సంఖ్య..!

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్రలోని చెంబూరు, విఖ్రోలిలో గోడలు కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 23కు పెరిగింది. చెంబూరులో జరిగిన ఘటనలో 17 మంది మృతి చెందగా.. విఖ్రోలిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆంగ్లపత్రిక ఇండియాటుడే పేర్కొంది. ఈ ఘటనల్లో మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించారు. ‘‘ముంబయిలోని చెంబూరు, విఖ్రోలిలో గోడలు కూలి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు.

17వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కొండచరియలు విరిగిపడటంతో గోడలు కూలాయని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం  పేర్కొంది. ఇప్పటికే బృందంలోని సిబ్బంది గోడ కింద చిక్కుకున్న పలువురిని కాపాడారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. చెంబూరులో ఒంటిగంట సమయంలో, విఖ్రోలిలో అర్ధరాత్రి 2.30 సమయంలో గోడలు కూలాయి. ముంబయి నగరాన్ని భారీ వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోరివాలిలో పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. చాలాచోట్ల పట్టాలపై నీరు నిలవడంతో సెంట్రల్‌, వెస్టర్న్‌ రైల్వే సంస్థలు సర్వీసులను  నిలిపివేశాయి.

భారత వాతావరణ శాఖ ముంబయిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. గ్రీన్‌ అలర్ట్‌ అంటే ఎటువంటి చర్యలు అవసరం లేదని.. అదే రెడ్‌ అలర్ట్‌ అంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అర్థం. ఆరెంజ్‌ అలర్ట్‌ అంటే అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధం కావాలని. 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని