టీకాలు తగ్గుతున్నాయ్‌.. మరణాలు పెరుగుతున్నాయ్‌

తాజా వార్తలు

Updated : 19/05/2021 21:54 IST

టీకాలు తగ్గుతున్నాయ్‌.. మరణాలు పెరుగుతున్నాయ్‌

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ విమర్శ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడి, వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబడుతోంది. దేశంలో ఓవైపు టీకాల కొరత, మరోవైపు కరోనా మరణాల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

‘వ్యాక్సిన్‌లు తగ్గుతున్నాయి. కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో దృష్టి మరల్చడం, అసత్యాలను ప్రచారం చేయడం, వాస్తవాలను దాచిపెడుతూ గంభీరంగా మాట్లాడడమే కేంద్ర ప్రభుత్వ విధానం’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ తగ్గడం, రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న కొవిడ్‌ మరణాలపై వివిధ వార్తా సంస్థల క్లిప్పింగ్‌లను రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత రాష్ట్రాలను వేధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో మూడు టీకాలు అనుమతి పొందినప్పటికీ.. డిమాండ్‌కు సరిపడా టీకాలను ఆయా కంపెనీలు సరఫరా చేయలేకపోతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొన్ని రోజులపాటు నిలిపివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ కంపెనీల నుంచి టీకాలను దిగుమతి చేసుకునేందుకు ఆయా రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లను పిలుస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 18కోట్ల 58లక్షల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. ఇదే సమయంలో దేశంలో కొవిడ్‌ మరణాలు మాత్రం రికార్డు స్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4529 మంది కొవిడ్‌ బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్‌తో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 2లక్షల 83వేలు దాటడం ఆందోళన కలిగించే విషయం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని