Delhi Court Firing: కోర్టులో హత్య.. జైల్లో ఖైదీకి లైవ్‌ అప్‌డేట్లు..!

తాజా వార్తలు

Published : 28/09/2021 01:37 IST

Delhi Court Firing: కోర్టులో హత్య.. జైల్లో ఖైదీకి లైవ్‌ అప్‌డేట్లు..!

ఇంటర్నెట్‌డెస్క: దిల్లీలోని రోహిణి కోర్టులో జరిగిన గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ మాన్‌ (గోగి) హత్య కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. వాస్తవానికి హంతకులు ఇద్దరూ జితేందర్‌పై కాల్పులు జరుపుతున్న సమయంలో తీహార్‌ జైల్లోని  మరో గ్యాంగ్‌స్టర్‌ ఈ హత్యను ఫోన్‌లో పర్యవేక్షిస్తున్నాడు. ఈ హత్య వెనుక టిల్లూ తాజ్‌పురియా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు గోగితో అతడికి దీర్ఘకాల వైరం ఉంది.

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు వర్గాల కథనం ప్రకారం.. ఈ హత్య సమయంలో టిల్లు నిరంతరం హంతకులు రాహుల్‌ త్యాగి, జగదీప్‌ జగ్గా, ఇతరులతో టచ్‌లో ఉన్నాడు. నిమిష నిమిషానికి వారి నుంచి టిల్లూ అప్‌డేట్లు తెలుసుకొన్నాడని సమాచారం. రోహిణీ కోర్టుకు ఎంత దూరంలో ఉన్నారు.. ఎంత సేపట్లో చేరుకొంటారు.. వంటి వివరాలు సేకరించాడు. ఇదే సమయంలో వినయ్‌, ఉమంగ్‌ అనే ఇద్దరు వ్యక్తులతో కూడా మాట్లాడాడు. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.

హంతకులు ఇద్దరు కోర్టు ఆవరణలోకి ప్రవేశించిన అనంతరం.. అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉందని.. దుండగులు తప్పించుకోవడం కష్టమని టిల్లూ గ్రహించాడు. వెంటనే  కాల్‌ కట్‌ చేశాడు. అదే సమయంలో కోర్టు పార్కింగ్‌లో ఉన్న మరో ఇద్దరికి ఫోన్‌ చేసి పారిపోవాలని సూచించాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అతడికి ఫోన్‌ అందుబాటులో ఉండటం తిహార్‌ జైలు భద్రతా లోపాలను తెలియజేస్తోంది.

ఓ కేసు విచారణలో భాగంగా గోగిని శుక్రవారం రోహిణిలోని కోర్టుకు తరలించారు. అదే సమయంలో న్యాయవాదుల వేషధారణలో వచ్చిన ముగ్గురు ప్రత్యర్థి గ్యాంగ్‌ సభ్యులు కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగిపై కాల్పులకు తెగబడ్డారు. ఇద్దరు దుండగులు దాదాపు 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. సినీఫక్కీలో జరిగిన ఈ దాడిలో జితేందర్‌ అక్కడిక్కడే మృత్యువాతపడ్డాడు. అదే సమయంలో అప్రమత్తమైన దిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు.. దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు దుండగులు హతమయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని