Oxygen: కేంద్రం, దిల్లీ మధ్య ‘ఆక్సిజన్‌’ వార్‌!
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 15:06 IST

Oxygen: కేంద్రం, దిల్లీ మధ్య ‘ఆక్సిజన్‌’ వార్‌!

దిల్లీ: కొవిడ్‌ రెండో ఉద్ధృతి సమయంలో దిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి నాలుగురెట్లు అధికంగా ఆక్సిజన్‌ను డిమాండ్‌ చేసిందంటూ సుప్రీంకోర్టు ఆడిట్‌ కమిటీ ఇచ్చినట్లు చెబుతున్న నివేదికతో కేంద్రం, ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం మధ్య వివాదం రాజుకుంది. ఈ నివేదిక వెలుగులోకి రావడంతో కేజ్రీవాల్‌ సర్కార్‌పై భాజపా విరుచుకుపడుతుండగా.. ఆప్‌ ప్రభుత్వం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. అదంతా తప్పుడు ప్రచారమని ఆరోపిస్తోంది. 

ఏప్రిల్‌-మేలో విపరీతమైన ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. చాలా ఆస్పత్రుల్లో  ప్రాణవాయువు అందక రోగులు కన్నుమూసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. దీంతో దిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ సమయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కేంద్రం దిల్లీకి ఆక్సిజన్‌ కేటాయింపులను పెంచింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు కేటాయింపులను తగ్గించింది. అయితే ఆప్‌ సర్కారు భారీగా ఆక్సిజన్‌ కోరుతుండటంతో సుప్రీంకోర్టు ఓ ఆడిట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. రెండో దశ సమయంలో దిల్లీకి రోజుకు 289 మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువు అవసరం కాగా, ఆప్‌ సర్కారు మాత్రం 1140 మెట్రిక్‌ టన్నుల కోసం డిమాండ్‌ చేసినట్లు ఆ కమిటీ తన నివేదికలో పేర్కొందని తాజాగా కథనాలు వెలువడుతున్నాయి.

కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పాలి!

ఈ కమిటీ నివేదికపై భాజపా అధికార ప్రతినిధి సాంబిత్‌ పాత్ర స్పందిస్తూ.. కేజ్రీవాల్‌ సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇది పూర్తిగా నేరపూరిత నిర్లక్ష్యమే. కేజ్రీవాల్‌ ఘోరమైన నేరానికి పాల్పడ్డారు. దీని మూల్యం ఎంతో మనం ఊహించుకోవచ్చు. కొవిడ్‌ నియంత్రణలో తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్రంపై మోపేందుకు కేజ్రీవాల్‌ రాజకీయాలకు పాల్పడ్డారని ఈ నివేదిక చూస్తే అర్థమవుతోంది’’ అని దుయ్యబట్టారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, దానికి కేజ్రీవాల్‌ బాధ్యత వహించాలని అన్నారు. మరో భాజపా నేత బీఎల్‌ సంతోష్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. వేలమంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిన కేజ్రీవాల్‌ ఈ నేరపూరిత చర్యలకు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

అలాంటి నివేదికే శుద్ధ అబద్ధం!

అయితే భాజపా విమర్శలపై దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా స్పందించారు. భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ‘‘అసలు అలాంటి నివేదిక లేదు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ఆడిట్‌ కమిటీ సభ్యులతో మేం మాట్లాడాం. అలాంటి నివేదిక ఏదీ తాము సంతకాలు చేసి ఆమోదించలేదని వారు చెప్పారు. భాజపా తప్పుడు నివేదికను చూపిస్తోంది. సంతకాలు చేసిన నివేదికను చూపించాలని నేను సవాల్‌ చేస్తున్నా. ఇలా చేయడం వల్ల.. సీఎం కేజ్రీవాల్‌నే కాదు.. ఆక్సిజన్‌ కొరతతో ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది కుటుంబాలను భాజపా అవమానిస్తోంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని