Delta: అమెరికాలో డెల్టా వేరియంట్‌ విజృంభణ!

తాజా వార్తలు

Updated : 08/07/2021 12:07 IST

Delta: అమెరికాలో డెల్టా వేరియంట్‌ విజృంభణ!

80 శాతం అవే కేసులు

వాషింగ్టన్‌: భారత్‌లో అమాంతం విరుచుకుపడిన కరోనా డెల్టా వేరియంట్‌ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా వైరస్ ప్రధాన రకంగా మారిందని ఆ దేశ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ చిన్నారులపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్న కొత్త కేసుల్లో 80 శాతం కంటే అధికంగా డెల్టా రకం కేసులే వెలుగు చూస్తున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. మిస్సోరీ, కేన్సస్, అయోవా రాష్ట్రాల్లో 80 శాతం కేసులు డెల్టా వేరియంటే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఉటా, కొలరాడో రాష్ట్రాల్లో పాజిటివ్‌గా తేలిన బాధితుల్లో 74.3 శాతం మందికి డెల్టా రకం సోకినట్లు సీడీసీ పేర్కొంది. 

టీకా వేయించుకోని వారిపై డెల్టా వేరియంట్‌ ప్రభావం అధికంగా ఉన్నట్లు అమెరికా వైద్య నిపుణులు అన్నామోరీ డేవిడ్‌సన్ వివరించారు. కరోనా డెల్టా వేరియంట్‌కు సంక్రమణ తీవ్రత అధికమని.. దీన్ని తీవ్రమైనదిగా పరిగణించాలన్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు. గాల్వెస్టన్‌ కౌంటీ జిల్లా ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. ఆ జిల్లాలో నమోదైన 450 కేసుల్లో.. 6-12 ఏళ్ల మధ్య వయసు గల చిన్నారుల్లో 57 మంది డెల్టా బారిన పడ్డారు. కాగా ప్రస్తుత అధ్యయనాలను దృష్టిలో ఉంచుకుని చిన్నారులతో బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలకు వెళ్లే మహిళలు, ఇతరులు జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

చిన్నారులు, యువకులు ఎక్కువగా డెల్టా బారిన పడుతుండటంపై ఆరోగ్య సిబ్బంది ఆందోళన చెందుతున్నట్లు డేవిడ్‌సన్‌ తెలిపారు. డెల్టా సోకితే చాలా వరకు ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని.. తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు. అమెరికాలో చిన్నారులపై డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో రెండేళ్లు దాటిన చిన్నారులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. డెల్టా సంక్రమించకుండా ఉండేందుకు 20అడుగుల వరకు భౌతిక దూరం పాటించాలని తెలిపారు. కరోనా స్పైక్‌ ప్రోటిన్‌లో ఉత్పరివర్తనం కారణంగానే డెల్టా అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగకపోతే డెల్టా వేరియంట్‌ వ్యాప్తి భయంకరంగా ఉండే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని