Myanmar: ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం బారులు తీరిన జనం 

తాజా వార్తలు

Published : 15/07/2021 21:17 IST

Myanmar: ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం బారులు తీరిన జనం 

మనకి పొరుగునే ఉన్న మయన్మార్‌లో ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు జరిగి, 900 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దేశాన్ని కొవిడ్‌ వేవ్‌ చుట్టుముట్టడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వందలాది మంది  మృతి చెందుతున్నారు. ప్రజలు పెద్ద వరుసల్లో ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం బారులు తీరారు. తమ చేతిలో ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్లను భర్తీ చేయించుకునేందుకు లైన్లు కట్టారు. తమ ఇంట్లో కొవిడ్‌ బారిన పడ్డవారికోసం కర్ఫ్యూను, సైనిక పాలకుల ఆంక్షలను సైతం ఉల్లంఘించి బయటికి వస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఉన్న ఎంతోమంది తమ కుటుంబ సభ్యుల ఊపిరి నిలిపేందుకు తీవ్రంగా ప్రయాసలు పడుతున్నారు. 

హృదయ విదారక దృశ్యాలు!
‘‘మా అక్క కొవిడ్‌ నుంచి మూడు రోజులుగా తీవ్రంగా బాధపడుతోంది’’ అని థాన్‌ జా విన్‌ చెప్పారు. ‘‘మొదటి రోజు ఆమె తల తిరుగుతుందని చెప్పింది. బీపీ కూడా పడిపోయింది. నిన్నటి రోజు ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఊపిరి తీసుకోవడం ఆమెకు కష్టంగా మారింది’’ అని చెప్పాడు.  ‘‘అయితే, ఈ ఉదయం నేను క్యూలో నిలబడి ఉండగానే మా మేనకోడలు ఫోన్‌ చేసి, ఇంటికి తిరిగి రమ్మని, ఆమె మరణించిందని చెప్పింది’’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.

బుధవారం ఒక్కరోజే  7000 కొత్తకేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.  యాంగాన్‌, మాండలేలో లక్షలాది మంది ప్రజలను ఇళ్లు కదలకుండా లోపలే ఉండాలని సైన్యం ఆదేశించింది. అయినా  కొవిడ్‌ వ్యాప్తితో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇరుగుపొరుగున ఉన్న ఇళ్లల్లోంచి మృతదేహాలను తీసుకెళ్లేందుకు వాలంటీర్లు వస్తూనే ఉన్నారు. యాంగాన్‌ పట్టణంలోని యె క్యా మో అనే జాలరి మాట్లాడుతూ, తెల్లవారుజామున మూడు గంటలకే తను ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం క్యూలో వచ్చి నిలబడ్డానని, అయితే తను వచ్చేటప్పటికే తనకంటే ముందు 14 మంది వరుసలో నిలబడి ఉన్నారని చెప్పాడు. ‘‘రాత్రంతా నేను నిద్ర పోలేదు. అలాగే ప్రస్తుతం ఇంకా మార్షల్‌ లానే కొనసాగుతుండటంతో సైనికుల భయం కూడా పట్టుకుంది’’ అని చెప్పాడు. స్టేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ కౌన్సిల్‌
తరఫున జుంతా నాయకుడు మిన్‌ ఆంగ్‌ హ్లయింగ్‌ మాత్రం, ‘ఎలాంటి ఆందోళనా అక్కర్లేదు. చాలినంత ఆక్సిజన్‌ ఉంది. ఎక్కువ బెంగ పెట్టుకోకండి. పుకార్లు వ్యాప్తి చేయకండి’ అని ప్రకటించాడు.

పాలకుల అసమర్థతతో ముదిరిన సంక్షోభం!
మయన్మార్‌లో హింసాత్మక మిలిటరీ తిరుగుబాటు జరిగాక, ఎంతోమంది డాక్టర్లు దానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన సమయంలో కరోనా రెండో వేవ్‌ విజృంభించింది. ఇక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా నత్తనడకనే సాగుతోంది. మొత్తం 5.4 కోట్లమంది జనాభా గల దేశంలో ఇంతవరకూ 1.75 కోట్లమందికి మాత్రమే వ్యాక్సిన్లు అందించారు.  మయన్మార్‌లో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూత టామ్‌ ఆండ్రూస్‌ మాట్లాడుతూ ‘‘దేశంలో వైద్యవనరుల కొరత ఉంది.  పాలకుల సామర్థ్యం కూడా అంతంత మాత్రమే. ఈ సంక్షోభాన్ని నియంత్రించేంత శక్తి వారికి లేదు’’ అని అన్నారు. ‘‘ప్రజలకు మిలిటరీ పాలన మీద నమ్మకం లేకపోవడంతో ఈ సంక్షోభం మరింత అపాయకరంగా మారింది’’ అని ఆయన తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని