మాటలకు.. చేతలకు పొంతనలేనిదే డ్రాగన్‌

తాజా వార్తలు

Published : 09/03/2021 14:37 IST

మాటలకు.. చేతలకు పొంతనలేనిదే డ్రాగన్‌

* భారత్‌పై నిఘాను పెంచిన చైనా..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘భారత్‌-చైనా మిత్రదేశాలు’ అంటూ చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ నిన్ననే ప్రకటించారు. అదే సమయంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌పై నిఘాను చైనా మరింత పటిష్టం చేసిందని తేలింది. ఇది యుకేకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. మరోపక్క డెప్సాంగ్‌, గోగ్రాపోస్టు వంటి చోట్ల బలగాల ఉపసంహరణపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. 

భారత సరిహద్దుల్లో ఇంటెలిజెన్స్‌, సర్వైలెన్స్‌,టార్గెట్‌ అక్విజేషన్‌ అండ్‌ రికానసన్స్‌ (ఐఎస్‌టీఏఆర్‌) వ్యవస్థను చైనా బలోపేతం చేస్తోందని యుకేకు చెందిన జానీస్‌ ఇన్ఫర్మేషన్‌ గ్రూప్‌ వెల్లడించింది. ఈ విషయం చైనా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ సీసీటీవీలో వచ్చినట్లు పేర్కొంది.  దీనిలో భారత్‌ సమీపంలోని షియావ్‌ పోస్టులో  కొందరు సైనికులు టూ సెన్సర్‌ వ్యవస్థలను ఉపయోగిస్తున్న వీడియోలను ప్రసారం చేసింది. ఆ స్థావరం వద్ద నిర్మించిన బ్యారెక్స్‌ల్లో కూడా సెన్సర్లు, వాచ్‌టవర్లు ఉన్నట్లగా కనిపిస్తోంది. పాంగాంగ్‌ సరస్సు దగ్గర సైనిక ఉపసంహరణ జరిగిన కొన్ని వారాల తర్వాత ఈ విషయం బయటకొచ్చింది. 

శరవేగంగా సరిహద్దుల్లో బుల్లెట్‌రైలు నిర్మాణం..

భారత సరిహద్దుల వెంట టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌లో బుల్లెట్‌ రైలు నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. లాసా నుంచి న్యాంగ్చి మధ్య 435 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పనులను 2014లో చేపట్టారు. ఇది ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తుందని చైనాలో జరుగుతున్న నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌లో ప్రకటించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలోకి ఉండే న్యాంగ్చిలో చైనాకు ప్రర్వత యుద్ధతంత్రంలో నిపుణులైన 52వ, 53వ బ్రిగేడ్‌లు ఈ పట్టణంలోనే ఉంటాయి. అత్యంతవసర సమయాల్లో దళాలను వేగంగా సరిహద్దులకు తరలించేలా వీటిని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. 4.8 బిలియన్‌ డాలర్లతో నిర్మిస్తున్న ఈ రైల్వే లైన్‌ 75శాతం వంతెనలపై నుంచిగానీ, సొరంగాల్లో నుంచి కానీ నిర్మిస్తున్నారు. 

దీంతోపాటు చైనా పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ ప్రధాన స్థావరమైన చెంగ్డూను లాసాతో కలిపేలా సిచువాన్‌-టిబేట్‌ రైల్వే లైన్‌ పనులు వేగంగా జరుగుతున్నయి. భారత సరిహద్దుల వైపు ఉన్న చైనా సైనిక దళాలకు చెంగ్డూనే ప్రధాన స్థావరం. దీనిని 2030 నాటిపూర్తి చేయాలని చైనా భావిస్తోంది.  26స్టేషన్లతో నిర్మించే ఈ రైలు మార్గం వివాదాస్పద భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంటుంది. ఇది పూర్తి అయితే చైనా దళాలు చెంగ్డూ నుంచి లాసాకు కేవలం 13 గంటల్లో చేరుకోవచ్చు. అదే గతంలో దాదాపు 48 గంటల సమయం పట్టేది. 

గల్వాన్‌లో భారత్‌ వంతెన..

మరోపక్క భారత్‌ కూడా సరిహద్దుల్లో కీలక నిర్మాణాలను పూర్తి చేసింది. తూర్పులద్దాక్‌లోని గల్వాన్‌ నదిపై భారత్‌ వ్యూహాత్మకమైన వంతెన నిర్మాణం ఇటీవలే పూర్తి చేసింది. చైనా దళాలు భారత్‌తో ఘర్షణ పడటానికి గల కారణాల్లో ఈ వంతెన నిర్మాణాన్ని ఆపటం కూడా ఒకటి. కానీ, భారత దళాలు ఏ మాత్రం లెక్క చేయకుండా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశాయి. గల్వాన్‌, ష్యోక్‌ వంతెనల నదులు కలిసే చోట దీనిని నిర్మించారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని