Students: ‘డిజిటల్‌ తరగతులతో వైద్యులం కాలేం’

తాజా వార్తలు

Published : 06/06/2021 01:05 IST

Students: ‘డిజిటల్‌ తరగతులతో వైద్యులం కాలేం’

చైనా యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ పొందిన వైద్య విద్యార్థుల ఆవేదన

ఇంటర్నెట్‌ డెస్క్‌: శవ విచ్ఛేదన (డిసెక్షన్‌) తరగతులు వైద్యవృత్తిలో ఓ భాగం. కోర్సు ముగిసేంత వరకు వీటిని ప్రయోగశాలల్లో ప్రాక్టీస్‌ చేస్తూనే ఉండాలి. కరోనా కారణంగా విదేశీయులను చైనా తమ దేశంలోకి అనుమతించడం లేదు. దీంతో చైనాలో వైద్య విద్యనభ్యసిస్తున్న వేలాది మంది భారత విద్యార్థులు ప్రాక్టికల్‌ క్లాసులకు దూరమై, తీవ్రంగా నష్టపోతున్నారు. వీరికి ఆయా యూనివర్సిటీలు ఏడాది కాలంగా ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే నిర్వహిస్తుండటంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల్లోనూ అంతరాయం ఏర్పడుతోందని వాపోతున్నారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

జియాంగ్‌ జిటోంగ్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న చెన్నైకి చెందిన నందిత రవికుమార్‌ అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ‘భారత్‌లో మెడిసిన్‌ చదివేందుకు రూ.30 లక్షలు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో చైనాకు చెందిన యూనివర్సిటీని ఎంచుకున్నా. అక్కడ ఇందుకు రూ.8 లక్షలే ఖర్చవుతోంది. అయితే ఏడాది కాలంగా వైద్య విద్య తరగతులను ఆన్‌లైన్‌లో వినాల్సి వస్తోంది. ఒక్కోసారి వాటికి కూడా అంతరాయం ఏర్పడుతోంది. అత్యంత ముఖ్యమైన ప్రాక్టికల్‌ తరగతులను కోల్పోతున్నాం. డిజిటల్‌ తరగతులతో వైద్యులం కాలేం’ అని వెల్లడించింది.

నింజింగ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చదివే విద్యార్థి ప్రాచి తోమర్‌ మాట్లాడుతూ.. ‘ప్రాక్టికల్‌ తరగతులు లేకపోతే వైద్య విద్య వ్యర్థం. ఆన్‌లైన్‌ క్లాసులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. వైద్య విద్యను అభ్యసిస్తూ రోగిగా మారుతున్నా. మా సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. ఇరు దేశాలు చర్చలు జరిపి సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని వేడుకొంది.

ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, చైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో అనేక మంది విద్యార్థులు భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖతో పాటు చైనా ప్రభుత్వానికి కూడా లేఖలు పంపారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కాగా విద్యార్థుల సమస్యలు తీర్చాలని పలువురు నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చైనాతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని