Delhi: ఇప్పుడు తిరగండి..తరవాత నిందించండి
close

తాజా వార్తలు

Updated : 15/06/2021 16:59 IST

Delhi: ఇప్పుడు తిరగండి..తరవాత నిందించండి

వైద్యనిపుణుల అసహనం

ఆంక్షల సడిలింపుతో..దూరం మరుస్తోన్న ప్రజలు

దిల్లీ: కరోనా రెండో దశతో ఆంక్షలతో బందీ అయిన రాష్ట్రాలు..ప్రస్తుతం సడలింపుల దిశగా పయనిస్తున్నాయి. వైరస్ ఉద్ధృతి తగ్గడంతో దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. దాంతో మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ జనాలతో నిండిపోవడంతో..వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో జనాలు గుమిగూడితే మరోసారి వైరస్ ఉద్ధృతి తప్పదని హెచ్చరిస్తున్నారు. 

పూర్తిస్థాయిలో కొవిడ్ ఆంక్షలను ఎత్తివేసే దిశగా దిల్లీ ప్రభుత్వం పయనిస్తోంది. ఇది వైద్యనిపుణులను తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రజలు భౌతిక దూరం మరిచి, తమ పనులు చేసుకుపోతున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కేసులు పెరిగితే తిరిగి కఠిన ఆంక్షలు అమలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. కరోనా రెండోదశతో ఉక్కిరిబిక్కిరి అయిన దిల్లీలో మేలో భారీగా మరణాలు సంభవించాయి. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధించింది. ఆసుపత్రిలో పడకల కోసం బాధితులు సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తులు చేశారు. అంబులెన్సులకు అసలు కంటే ఎన్నోరెట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. కొవిడ్ బారినపడినవారు వైద్యం కోసం వచ్చి, పార్కింగ్ ప్రదేశాల్లో ప్రాణాలు వదిలేసిన ఘటనలూ ఉన్నాయి. మార్చురీలు నిండుకోగా.. శ్మశానాల్లో అంత్యక్రియల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఆంక్షల సడలింపులతో ప్రజలు అవన్నీ మరిచినట్లున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘ఆంక్షలు సడలించిన నేపథ్యంలో దిల్లీలోని ఒక మాల్‌ను తెరవగానే గతవారాంతం 19వేల మంది షాపింగ్ చేశారు. మేము పిచ్చివాళ్లమా? మళ్లీ కొవిడ్ బాంబు పేలేవరకు వేచి చూడండి. ప్రభుత్వం, ఆసుపత్రులు, దేశాన్ని నిందించండి’ అంటూ మ్యాక్స్ హెల్త్‌కేర్‌కు చెందిన అంబరీశ్‌ మిత్తల్ ట్విటర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  

సుమారు ఐదు వారాల కఠిన లాక్‌డౌన్ అమలు చేసిన దిల్లీ ప్రభుత్వం..అన్‌లాక్ ప్రణాళికలో భాగంగా దుకాణాలను పూర్తిగా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లు, సబ్‌అర్బన్ రైళ్లను 50 శాతం సామర్థ్యంతో నడిపేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఈ ప్రక్రియ శాస్త్రీయ రీతిలో ఉండాలని వైద్యులు అంటున్నారు. ‘దిల్లీ మరింత శాస్త్రీయబద్ధంగా ఆంక్షలకు సడలింపులు ఇవ్వాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు ’ అని మరో ప్రముఖ సర్జన్ హెచ్చరించారు. మరోపక్క కొరత కారణంగా టీకా పంపిణీ కూడా అనుకున్నంత వేగంగా సాగడం లేదు. వెరసి మూడోదఫా విజృంభణపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా నిన్న 60వేల కేసులు నమోదయ్యాయి. మార్చి 31 తరవాత ఈ స్థాయి తగ్గుదల కనిపించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని