రాందేవ్‌ వ్యాఖ్యలపై వైద్యుల నిరసన

తాజా వార్తలు

Updated : 01/06/2021 13:24 IST

రాందేవ్‌ వ్యాఖ్యలపై వైద్యుల నిరసన

దిల్లీ: అల్లోపతి వైద్యం, వైద్యులను అవమానించేలా యోగా గురువు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా..మంగళవారం దేశవ్యాప్తంగా వైద్యులంతా ‘బ్లాక్‌ డే’గా పాటిస్తున్నారు. అలాగే తన వ్యాఖ్యలపై రామ్‌దేవ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని పలు వైద్య సంఘాలు డిమాండ్ చేశాయి. ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్ (ఎఫ్ఓఆర్‌డీఏ) ఈ నిరసనకు పిలుపునిచ్చింది. అలాగే రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా 2021, జూన్‌ 1న బ్లాక్‌ డేగా ప్రకటిస్తున్నాం. జాతీయ స్థాయిలో మా నిరసనను వ్యక్తం చేస్తాం. ఆయన చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని మేం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అంటువ్యాధుల చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని ఎఫ్ఓఆర్‌డీఏ ట్విటర్‌లో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కూడా ఈ బ్లాక్‌ డేకు మద్దతు ప్రకటించింది. దీనిలో భాగంగా వైద్యులంతా పని ప్రదేశాల్లో నల్ల బ్యాడ్జ్‌లు ధరించి బాబా వ్యాఖ్యలపై నిరసన తెలిపారు.

‘అల్లోపతి పనికిమాలిన వైద్యం’ అంటూ రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలతో ఓ వీడియో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వైఖరిని వైద్య సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్..మీ మాటలు ఉపసంహరించుకోండంటూ ఆయనకు ఘాటు లేఖ రాశారు. దాంతో వెనక్కి తగ్గిన బాబా.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. అయితే ఆయన మాటలకు ఆగ్రహానికి గురైన ఐఎంఏ ఉత్తరాఖండ్‌ రూ.1,000కోట్లకు పరువు నష్టం దావా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని