
తాజా వార్తలు
టీకాపై వదంతులు నమ్మొద్దు: కేజ్రీవాల్
దిల్లీ: కరోనా వ్యాక్సిన్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైందన్న వైద్య నిపుణుల మాటలపై భరోసా ఉంచాలన్నారు. దేశవ్యాప్తంగా నేడు టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్(ఎల్ఎన్జేపీ) ఆసుపత్రిలో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. టీకా తీసుకున్న కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు. కరోనాపై పోరులో ముందున్న వారిని ఈ సందర్భంగా ప్రశంసించారు.
దిల్లీలో మొత్తం 81 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకు టీకా తీసుకున్న ఏ ఒక్కరిలోనూ ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కరోనా ముప్పు తొలగనున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ నిబంధనల్ని పాటించాల్సిందేనని కోరారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరన్నారు.
అంతకుముందు దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. దిల్లీలోని ఎయిమ్స్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సమక్షంలో తొలి టీకా వేశారు. కరోనాపై పోరులో ముందున్న పారిశుద్ధ్య కార్మికుల్లో ఒకరైన మనీష్ కుమార్‌కు తొలి టీకా ఇచ్చారు.
ఇవీ చదవండి..
టీకా తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్!
అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం