Sputnik Light: రష్యా ప్రయోగాల డేటాతో దరఖాస్తు!

తాజా వార్తలు

Published : 01/07/2021 21:55 IST

Sputnik Light: రష్యా ప్రయోగాల డేటాతో దరఖాస్తు!

డాక్టర్‌ రెడ్డీస్‌కు నిపుణుల కమిటీ అవకాశం

దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన సింగిల్‌ డోసు టీకా స్పుత్నిక్‌ లైట్‌ ప్రయోగాలకు నిరాకరిస్తూ సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ (SEC) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రత్యేకంగా భారత్‌లో మరోసారి క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని.. రష్యాలో నిర్వహించిన మూడోదశ ప్రయోగాల సమాచారంతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి సురక్షితమైనదే కాక వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం కలిగినట్లు తేలింది. అంతేకాకుండా ఇప్పటికే స్పుత్నిక్‌-వి తుది దశ ప్రయోగాలు భారత్‌లో చేపట్టడంతో మరోసారి స్పుత్నిక్‌ లైట్‌ ప్రయోగాలు ఇక్కడ అవసరం లేదని నిపుణుల కమిటీ తెలిపినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం రష్యాలో కొనసాగుతున్న స్పుత్నిక్‌ లైట్‌ తుది దశ ప్రయోగాల సమాచారం వచ్చిన తర్వాత వాటిని సమర్పిస్తే సరిపోతుందని నిపుణులు కమిటీ (SEC) వెల్లడించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.

రెండు డోసుల ‘స్పుత్నిక్‌ వి’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఆర్‌డీఐఎఫ్‌.. ఒకే డోసు ‘స్పుత్నిక్‌ లైట్‌’ వ్యాక్సిన్‌ను రూపొందించింది. దీనికి ఇప్పటికే రష్యాలో అత్యవసర అనుమతి లభించింది. కొవిడ్‌-19ను అదుపు చేయడంలో ఒకే డోసు వ్యాక్సిన్‌ 79.4% ప్రభావశీలత కనబరిచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. రష్యా, యూఏఈ, ఘనా మరికొన్ని దేశాల్లో 7వేల మందిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరిపారు. వివిధ దేశాల్లో కొవిడ్‌-19 తీవ్రత దృష్ట్యా ప్రజలకు తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోందని, దీనికి ఒకే డోసు వ్యాక్సిన్‌ మంచి పరిష్కారమని ఆర్‌డీఐఎఫ్‌ చీఫ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ పేర్కొన్నారు. అదే సమయంలో రెండు డోసుల ‘స్పుత్నిక్‌ వి’ టీకాను కొనసాగిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ భారత ఔషధ నియంత్రణ సంస్థలు వీటి ఫలితాలపై సంతృప్తి చెందితే త్వరలోనే సింగిల్‌ డోస్‌ అందుబాటులోకి రానుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని