
తాజా వార్తలు
క్యాన్సర్‌పై యోధురాలు డా. శాంత కన్నుమూత
చెన్నై: ప్రముఖ ఆంకాలజిస్ట్, క్యాన్సర్‌పై రణభేరి మోగించిన శాస్త్రజ్ఞురాలు, పద్మవిభూషణ్ డాక్టర్ వి.శాంత కన్నుమూశారు. తన జీవితంలో సుదీర్ఘకాలం క్యాన్సర్ రోగుల సంరక్షణ కోసం కృషిచేసిన 93ఏళ్ల శాంత.. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఛాతిలో నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
నోబెల్ గ్రహీతలు సర్ సీవీ రామన్, సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ కుటుంబానికి చెందిన శాంత.. 1949లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత గైనకాలజీ, అబ్‌స్టెట్రిక్స్‌లో ఎండీ పూర్తిచేసిన ఆమె.. ఉమెన్స్ ఇండియన్ ఆసోసియేషన్ క్యాన్సర్ రిలీఫ్ ఫండ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి, ఆమె కుమారుడు కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన అడయార్ క్యాన్సర్ ఇనిస్ట్యిటూట్ అభివృద్ధిలో డాక్టర్ శాంత కీలక పాత్ర పోషించారు. పూరి గుడిసెల్లో 12 పడకలతో మొదలైన ఈ ఆసుపత్రి ఇప్పుడు దేశ విదేశాల్లోనే ప్రముఖ క్యాన్సర్ కేర్ సెంటర్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఇనిస్టిట్యూట్‌కు శాంత ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.
జీవితమంతా సేవలోనే..
చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలని కలలుగన్న శాంత.. 1955 నుంచి క్యాన్సర్ రోగులకు తన సేవలు అందిస్తున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా కీలకమైన శస్త్రచికిత్సలను పర్యవేక్షిస్తూ క్యాన్సర్ చికిత్సా పరిశోధనా రంగంలో సరికొత్త మార్పులను ఆవిష్కరించారు. క్యాన్సర్‌కు సంబంధించిన అధునాతన వైద్య సౌకర్యాలు ఆల్ట్రా సోనోగ్రఫీ, కంప్యూటరైజ్డ్ బయోగ్రఫీలను మూడు దశాబ్దాల క్రితమే అడయార్ ఇనిస్టిట్యూట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే తన జీవితంలో ఏనాడూ వైద్యాన్ని వృత్తిగా చూడని శాంత.. నేటికీ లక్షలాది మంది క్యాన్సర్ పీడితులకు ప్రాణదానం చేశారు. పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారు. పేద ప్రజలకు తక్కువ ధరకే మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు పాటుపడ్డారు. 90ఏళ్ల వయసులోనూ రోగులకు తన సేవలందించారు.
పద్మవిభూషణ్‌తో సత్కారం..
క్యాన్సర్‌పై పోరులో ఆమె చేసిన పరిశోధనలు, వైద్యరంగానికి ఆమె చేసిన కృషికి గానూ కేంద్ర ప్రభుత్వం ఆమెను అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. రామన్ మెగెసెసెతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను ఈమె అందుకున్నారు. 2005లో నోబెల్ బహుమతికి కూడా నామినేట్ అయ్యారు.
మోదీ సంతాపం..
డాక్టర్ శాంత మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. ‘క్యాన్సర్ రోగులకు అత్యుత్తమ చికిత్స అందించేందుకు డాక్టర్ శాంత ఎంతగానో కృషి చేశారు. ఆమె నిర్వహిస్తున్న అడయార్ ఆసుపత్రి పేదలు, అణగారిన వర్గాలకు వైద్య సేవలు అందిస్తోంది. అలాంటి వ్యక్తి మృతిచెందడం బాధాకరం. ఓంశాంతి’ అని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. 2018లో అడయార్ ఇనిస్టిట్యూట్ సందర్శన సందర్భంగా డాక్టర్ శాంతను కలిసిన ఫొటోలను మోదీ పంచుకున్నారు. కేంద్ర మంత్రులు డా. హర్షవర్ధన్, నిర్మలా సీతారామన్ తదితర ప్రముఖులు కూడా శాంత మృతికి సంతాపం ప్రకటించారు.
ఇవీ చదవండి..
లక్షద్వీప్‌నూ తాకిన కరోనా మహమ్మారి