‘పాంచ్‌’ పటాకా.. మోగిన ఎన్నికల నగారా

తాజా వార్తలు

Updated : 26/02/2021 18:48 IST

‘పాంచ్‌’ పటాకా.. మోగిన ఎన్నికల నగారా

దిల్లీ: పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 27 నుంచి ఈ ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానున్నట్లు ఈసీ ప్రకటించింది. పశ్చిమబెంగాల్‌లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 2న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.

ఈ రాష్ట్రాల్లో మొత్తం 18.68కోట్ల ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) సునిల్‌ అరోడా వెల్లడించారు. బెంగాల్‌లో లక్షకు పైగా, తమిళనాడులో 89వేలు, కేరళలో 40వేలు, అసోంలో 33వేలు, పుదుచ్చేరిలో 1500 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈసారి పోలింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచనున్నట్లు తెలిపారు. పుదుచ్చేరి మినహా నాలుగు రాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.30.8లక్షలకు పెంచినట్లు సునిల్‌ అరోడా వెల్లడించారు.

ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌కు అవకాశం

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, అక్కడకు అదనపు బలగాలను పంపిస్తున్నట్లు సీఈసీ వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయనున్నట్లు చెప్పారు. ఓటు వేసేందుకు వచ్చే కరోనా రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా దృష్ట్యా ఈ సారి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ నిబంధనల మేరకు రోడ్‌షోకు అనుమతులు ఉంటాయని వివరించారు. పరీక్షలు, పండగలు చూసే ఎన్నికల తేదీలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నట్లు తెలిపారు. వీటికి ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. 

ఎన్నికల తేదీలు ఇవే..

అసోం

మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి దశ, ఏప్రిల్‌ 1న రెండో దశ, ఏప్రిల్‌ 6న మూడో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు.  

కేరళ

ఈ రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 6న పోలింగ్‌ నిర్వహించనున్నారు.  

తమిళనాడు

తమిళనాడులోనూ ఒకే విడతలో ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి.  

పుదుచ్చేరి

పుదుచ్చేరిలోనూ ఒకే దశలో ఏప్రిల్‌ 6న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 

పశ్చిమ బెంగాల్‌

ఈ రాష్ట్రంలో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి దశ, ఏప్రిల్‌ 1న రెండో దశ, ఏప్రిల్‌ 6న మూడో దశ, ఏప్రిల్‌ 10న నాలుగో విడత, ఏప్రిల్‌ 17న ఐదో విడత, ఏప్రిల్‌ 22న ఆరో దశ, ఏప్రిల్‌ 26న ఏడో విడత, ఏప్రిల్‌ 29న ఎనిమిదో దశ పోలింగ్‌ జరగనున్నట్లు సీఈసీ అరోడా వెల్లడించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని