CEC: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధమే..!

తాజా వార్తలు

Published : 01/06/2021 17:57 IST

CEC: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధమే..!

ఆశాభావం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
2022లో ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీల గడువు

దిల్లీ: వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కీలక రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల్లో షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం విశ్వాసం వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ విజృంభణ వేళ.. బిహార్‌, పశ్చిమబెంగాల్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో జరిపిన ఎన్నికల నిర్వహణ నుంచి ఎంతో అనుభవాన్ని పొందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పునరుద్ఘాటించింది. ప్రస్తుతం వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండడంతో వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేసింది.

‘ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిప్తోంది. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ సమయంలోనూ బిహార్‌, పశ్చిమబెంగాల్‌, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాం. దీంతో మాకు మరింత అనుభవం రావడంతోపాటు కరోనా విజృంభణ వేళ ఎన్నికల నిర్వహణలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాం’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్రా వెల్లడించారు. ఇప్పటికే వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని.. త్వరలోనే మహమ్మారి ప్రభావం ముగిసిపోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించే స్థితిలో కచ్చితంగా ఉంటామని సీఈసీ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గడువు ముగిసే నాటికి ఎన్నికలను సజావుగా నిర్వహించి, విజేతల జాబితాను గవర్నర్‌లకు అందజేయడం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కర్తవ్యమని సుశీల్‌ చంద్రా గుర్తుచేశారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతన్న వేళ.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను వాయిదా వేస్తుందా? అన్న ప్రశ్నకు సుశీల్‌ చంద్రా ఈ విధంగా బదులిచ్చారు.

సవాల్‌గా ఎన్నికల నిర్వహణ..?

దేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో తొలిస్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు 14.66కోట్ల మంది ఓటర్లున్నారు. జనవరి 1, 2021 నాటికి పంజాబ్‌లో రెండు కోట్లు, ఉత్తరాఖండ్‌లో 78 లక్షలు, మణిపూర్‌లోలో 19.58 లక్షలు, గోవాలో 11.45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇలా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లో మొత్తం దాదాపు 17.84 ఓటర్లు ఉన్నట్లు అంచనా. దీంతో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి సవాల్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నిబంధనలు గాలికి..?

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు వివిధ దశల్లో పోలింగ్‌ నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ముఖ్యంగా వైరస్‌ తీవ్రత పెరుగుతున్నా.. పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది దశల్లో పోలింగ్‌ జరిపారు. ఇలా ఆయా రాష్ట్రాల్లో సెకండ్‌ వేవ్‌కు కారణం ఎన్నికల ప్రచారాలేనని విమర్శలూ వచ్చాయి. భారీ స్థాయిలో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడం కరోనా ఉద్ధృతికి ఒక కారణమని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ విషయంపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులను ముందస్తుగానే హెచ్చరించినప్పటికీ వారు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికలపై ఓవైపు ఆందోళన, మరోవైపు ఆసక్తి నెలకొంది. అయితే, అప్పటివరకు ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్‌ అందించగలిగితే సమస్యలు ఉండకపోవచ్చని మరికొందరి నిపుణుల భావన.

ఇక పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాలకు మార్చి 2022న అసెంబ్లీ కాలవ్యవధి ముగుస్తుండగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మే చివరకు ముగియనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉండగా, పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరిగిన మిని సంగ్రామం మాదిరిగానే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా ఉండనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని