మమతా బెనర్జీ ఆరోపణలన్నీ అవాస్తవాలే: ఈసీ

తాజా వార్తలు

Published : 05/04/2021 01:17 IST

మమతా బెనర్జీ ఆరోపణలన్నీ అవాస్తవాలే: ఈసీ

వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, నందిగ్రామ్‌లో ఓ పోలింగ్ బూత్‌లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ముఖ్యంగా కేంద్ర బలగాలు కొన్ని పార్టీలకు చెందిన గూండాలకు రక్షణ కల్పిస్తున్నాయని చేసిన ఆరోపణలు తీవ్రంగా తప్పుబట్టింది. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, పోలింగ్‌ సిబ్బందిపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేసింది. మమతా బెనర్జీ చెప్పినట్లుగా ఓటింగ్‌ సయంలో ఎటువంటి అడ్డంకులు కలగలేదని.. ఇందుకు సంబంధించి పోలింగ్‌ బూత్‌ల వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ను పూర్తిగా పరిశీలించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

ఏప్రిల్‌ 1న జరిగిన నందిగ్రామ్‌లోని బోయల్‌ ప్రాంతంలోని 7వ నంబరు పోలింగ్‌ కేంద్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు గూండాలు స్థానికులను ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారని..వీరికి కేంద్ర బలగాలు రక్షణ కల్పిస్తున్నాయని ఆరోపించారు. వీటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవట్లేదన్నారు. దీంతో అక్కడ నుంచే మమతా బెనర్జీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌తో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పోలింగ్‌ కేంద్రం వద్ద కొన్ని గంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పాటు తృణమూల్‌, భాజపా నేతల మధ్య స్పల్ప ఘర్షణకు దారితీసింది. దీంతో భారీ స్థాయిలో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది చివరకు మమతా బెనర్జీని సురక్షితంగా పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు తీసుకువచ్చారు.

ఇలా పోలింగ్‌ అక్రమాలు జరిగాయంటూ మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై ఎన్నికల పర్యవేక్షణ అధికారుల నుంచి ఈసీ పూర్తి నివేదిక తెప్పించుకుంది. అనంతరం ఆమె చేసిన ఆరోపణలపై పాయింట్ల వారీగా వివరణ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఓటర్లను తప్పుదోవ పట్టించే విధంగా గంటలకొద్దీ పోలింగ్‌ బూత్‌లోనే ఉన్నారని ఎన్నికల సంఘం పేర్కొంది. తద్వారా ఓటర్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు, శాంతి భద్రతలకు విఘాతం కల్గించడం, పోలింగ్‌ అధికారులు, ఎన్నికల సంఘంపై చేసిన ఆరోపణల వీడియోలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. చివరకు ఆమె చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే విచారణలో తేలినట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ను అతిక్రమించినందుకు మమతా బెనర్జీపైనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని