భాజపానేత వాహనంలో ఈవీఎం..!

తాజా వార్తలు

Updated : 02/04/2021 13:53 IST

భాజపానేత వాహనంలో ఈవీఎం..!

కరీమ్గంజ్‌ బూత్‌లో రీపోలింగ్ ఈసీ ఆదేశం


దిస్‌పూర్: అసోంలో గురువారం రెండోదశ పోలింగ్ అనంతరం ఈవీఎంల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. భాజపా నేతకు చెందిన కారులో ఈవీఎంలను తరలించారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఎన్నికల సంఘం దర్యాప్తునకు ఆదేశించింది. కరీమ్‌గంజ్ ప్రాంతంలో విధులు నిర్వర్తించిన నలుగురు పోలింగ్ అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు.. ఆ బూత్‌లో రీపోలింగ్‌కు ఆదేశించింది. 

అసోంలో గురువారం రెండో దశ పోలింగ్ ముగిసిన అనంతరం.. కరీమ్‌గంజ్ ప్రాంతానికి చెందిన పోలింగ్ అధికారులు ఈవీఎంలను భాజపా నేత క్రిష్ణేందు పాల్ వాహనంలో తరలించడాన్ని స్థానికులు గుర్తించారు. ఆ వాహనం పాల్ బంధువు పేరిట ఉందని గుర్తించిన స్థానికులు..ఆ వాహనంపై దాడి చేశారు. దాంతో ఈ ఘటనపై  ఎన్నికల సంఘం(ఈసీ) వివరణ కోరింది. అయితే, పోలింగ్‌ సిబ్బంది ఎక్కిన వాహనం భాజపా నేతకు చెందినదని మొదట తెలీదంటూ జిల్లా ఎన్నికల అధికారి ఈసీకి నివేదికను సమర్పించారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను తీసుకెళ్తోన్న వాహనంలో సమస్య తలెత్తగా.. సిబ్బంది అటుగా వెళ్తోన్న కారు లిఫ్ట్ అడిగి ఎక్కినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే, వారు ఎక్కిన కారు పాథార్కండి ఎమ్మెల్యేకు సంబంధించింది కాగా..ప్రస్తుతం ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ వాహనంలో ఉన్నవారిపై స్థానికులు కర్రలతో దాడి చేశారు. భద్రతా బలగాలను సైతం లెక్కచేయలేదు. దాంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఈ ఘటన వీడియోలను నెట్టింట్లో షేర్ చేసి.. అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై ఈసీ ఉన్నతాధికారులు స్పందించారు. ఈవీఎంపై ఉండే సీల్ యథావిధిగా ఉన్నట్టు ప్రాథమికంగా అందిన నివేదికలో వెల్లడైందన్నారు. అలాగే బాధ్యులైన నలుగురు పోలింగ్ సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసింది. పోల్ ప్యానెల్ ఇప్పటికే రీపోలింగ్‌కు ఆదేశించగా.. ఈ ఘటనలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా..అసోంలో రెండో దశ పోలింగ్‌లో 77 శాతం ఓటింగ్ జరిగింది. 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని