ఆ ప్రాజెక్టులతో చైనాకు అడ్డుకట్ట: ఈయూ

తాజా వార్తలు

Published : 13/07/2021 01:12 IST

ఆ ప్రాజెక్టులతో చైనాకు అడ్డుకట్ట: ఈయూ


ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా అనుసరిస్తున్న ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ విధానానికి ప్రత్యామ్నాయంగా సొంతంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని యూరోపియన్‌ యూనియన్‌ అభిప్రాయానికి వచ్చింది.  చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌ యూరోప్‌ను ఆసియాతో అనుసంధానించడం ద్వారా తమ ప్రాబల్యాన్ని చాటాలనుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల ఈయూ 2022 నుంచి ఆసియాతో తనే సొంతంగా భారీ కనెక్టివిటీ ప్రణాళికను చేపట్టాలని నిర్ణయించుకుంది. సోమవారం యూరోపియన్‌ యూనియన్‌ దేశాల విదేశాంగ మంత్రులు తమ ఖండానికి మిగతా ప్రపంచంతో అనుసంధానం పెంచుకునేందుకు గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లాన్‌ను అంగీకరించారు. ఇటీవల భారత్‌, జపాన్‌, ఇతర జీ7 దేశాలతో చర్చలు జరిపిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం వెలువడింది.

ప్రత్నామ్నాయం కోసమే!

‘‘చైనా తన ఆర్థిక, వాణిజ్య విధానాల ద్వారా ప్రపంచమంతటా ప్రభావాన్ని చూపిస్తోంది.  ఈ నేపథ్యంలో మాకు కూడా ఒక ప్రత్యామ్నాయం కావాలి’’ అని జర్మనీ విదేశాంగ మంత్రి హెయికో మాస్‌ బ్రసెల్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.  ‘‘ఈ అంశంలో ఈయూ అమెరికాతో  సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతుంది’’  అని ఆయన అన్నారు. ఇప్పటికే ఈయూ రవాణా, ఎనర్జీ, డిజిటల్‌ ప్రాజెక్టులకు సంబంధించి ఆసియాతో అనుసంధానం కోసం జపాన్‌, భారత్‌తో ఒప్పందానికి వచ్చింది. మరోవైపు బడుగు దేశాలకు చైనా ఉదారంగా అందిస్తున్న సహాయ సహకారాలపై భారత్‌, జపాన్‌లు ఆందోళనగా ఉన్నాయి. గత జూన్‌లో ఇంగ్లాండులో ఏర్పాటైన సదస్సులో జీ7 దేశాలు తాము ఇతర దేశాలకు మౌలిక వసతుల కోసం అందించే రుణాలలో పారదర్శకంగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చాయి.

60 దేశాల్లో చైనా ప్రాజెక్టులు!

‘గ్లోబల్లీ కనెక్టెడ్‌ యూరోప్‌’ అనే ఈయూ ఎత్తుగడలో, ఎక్కడా చైనాను తమకు విరోధిగా పేర్కొనలేదని లక్సెంబర్గ్‌ విదేశాంగ మంత్రి జీన్‌ ఆసెల్‌బోర్న్‌ తెలియజేశారు. జర్మనీ ఉత్పత్తి చేసే కార్లు సొంత దేశంలో కంటే చైనాలోనే అధికంగా అమ్ముడుపోతాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2013 నుంచి చైనా దాదాపు 60 దేశాల్లో నిర్మాణరంగంలో పలు ప్రాజెక్టులను జోరుగా కొనసాగిస్తోంది. భూ, సముద్ర మార్గాల ద్వారా ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, తూర్పు ప్రాచ్య దేశాలు, యూరోప్‌, ఆఫ్రికా ఖండాలతో అనుసంధానం చేసుకుంటోంది. కానీ, తన ప్రాబల్యాన్ని చాటాలనే ఉద్దేశం తనకు ఏ కోశానా లేదని, సాధారణ ప్రజానీకానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసమే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని చైనా నమ్మబలుకుతుండటం విశేషం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని