హైదరాబాద్‌ పోలీసులేం చేశారో అలా చేస్తేనే..: మాజీ సీఎం కుమారస్వామి

తాజా వార్తలు

Updated : 27/08/2021 22:20 IST

హైదరాబాద్‌ పోలీసులేం చేశారో అలా చేస్తేనే..: మాజీ సీఎం కుమారస్వామి

బెంగళూరు: మైసూరు నగర శివారులో ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దారుణ ఘటనను మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి ఖండించారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 2019లో హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనలో నిందితుల్ని అక్కడి పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చెన్నపట్నలో శుక్రవారం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. దిశ అత్యాచారం కేసులో హైదరాబాద్‌ పోలీసులు వ్యవహరించిన తీరును ప్రశంసించారు. ఆ కేసులో నిందితుల పట్ల హైదరాబాద్‌ పోలీసులు వ్యవహరించినట్టే మైసూరులో విద్యార్థినిపై రేప్‌ కేసు ఘటనలో దోషులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్‌ పోలీసుల చర్యలను అనుసరించాలని సూచించారు. ఇలాంటి నేరాల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మెరుగుపడవన్నారు. 

మైసూరులో జరిగిన అత్యాచారం కేసులో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని, ఈ విషయంలో హైదరాబాద్‌ పోలీసుల చర్యల్ని అనుసరించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా ఆపలేకపోతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు.  గ్రామాల్లో జూద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ప్రస్తుత వ్యవస్థ నేరాలను ప్రోత్సహించేలా ఉందన్న కుమారస్వామి.. నేరాలకు పాల్పడి జైలుకు వెళ్తున్న వారు కొన్ని రోజుల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చేస్తున్నారన్నారు. నేరాలు చేసినా తమకేం కాదనే నమ్మకంతో వారు వ్యవహరిస్తున్నారన్నారు. 

మరోవైపు, కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌ సింగ్‌ మాట్లాడుతూ.. దారుణాలకు పాల్పడిన వారిని నరికి వేస్తే ఇలాంటివి పునరావృతం కావని వ్యాఖ్యానించారు. భాజపా సీనియర్‌ నేత, మాజీ సీఎం యడియూరప్ప స్పందిస్తూ.. ఈ కేసులో పోలీసులు నిజాయతీగా వ్యవహరిస్తున్నారని, తమ శక్తికి మించి పనిచేస్తున్నారన్నారు. త్వరలోనే నేరస్థుల్ని పట్టుకొని శిక్షిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఈ ఘటనలో దోషుల్ని ఉరితీయాలని బెళగావి గ్రామీణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్‌ డిమాండ్‌ చేశారు. ఇన్ని రోజులైనా నేరస్థుల్ని పోలీసులు ఇంకా పట్టుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని