అది మా పొరపాటే : ఫేస్‌బుక్‌

తాజా వార్తలు

Updated : 29/04/2021 17:45 IST

అది మా పొరపాటే : ఫేస్‌బుక్‌

మోదీ హ్యాష్‌టాగ్‌పై స్పందించిన ఫేస్‌బుక్‌
వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ హ్యాష్‌టాగ్‌ను తొలగించాలని భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఫేస్‌బుక్‌ స్పష్టం చేసింది. ఆ హ్యాష్‌టాగ్‌ను పొరపాటున తొలగించామని.. అనంతరం పునరుద్ధరించినట్లు వెల్లడించింది. అటు ఈ అంశంపై వచ్చిన వార్తలను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ కూడా ఖండించింది. సదరు హ్యాష్‌టాగ్‌ను తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశించినట్లు ఓ అంతర్జాతీయ వార్త సంస్థ ప్రచురించిన కథనం తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘అసమ్మతిని అణచివేయడంలో భాగంగా ఓ హ్యాష్‌టాగ్‌ను తొలగించాలని భారత ప్రభుత్వం ప్రయత్నించిందంటూ అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం తప్పుదారి పట్టించేదిగా ఉంది’ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ ఐటీశాఖ పేర్కొంది. ఈ హ్యాష్‌టాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టంచేసింది. ఆ హ్యాష్‌ట్యాగ్‌ను పొరపాటున తొలగించినట్లు ఫేస్‌బుక్‌ కూడా అంగీకరించిన విషయాన్ని ఐటీశాఖ గుర్తుచేసింది. ‘కరోనా మహమ్మారిపై పోరులో నిమగ్నమైన ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని చాటిచెప్పడంలో మీడియా పాత్ర కీలకం. ఇటువంటి సున్నితమైన సమయంలో కోట్లాది మంది సాధారణ పౌరులకు మద్దతుగా నిలవాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కూ యాప్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ప్రభుత్వం చెప్పలేదు. పొరపాటున తొలగించాం

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణతో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోన్న విషయం తెలిసిందే. ఈ సంక్షోభానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమని ఆరోపిస్తూ కొందరు యూజర్లు ‘రిజైన్‌‌మోదీ’ అంటూ ఫేస్‌బుక్‌లో హ్యాష్‌ట్యాగ్‌ సర్యులేట్‌ చేశారు. దీంతో అది ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొట్టింది. అయితే, కొన్ని గంటలకే సదరు హ్యాష్‌టాగ్‌ను ఫేస్‌బుక్‌ తొలగించింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అప్పటికే ఆ హ్యాష్‌టాగ్‌ను ఫేస్‌బుక్‌ పునరుద్ధరించింది. దీనిపై స్పందించిన ఫేస్‌బుక్‌.. భారత ప్రభుత్వం అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని.. ఆ పోస్టును పొరపాటున తొలగించామని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనాన్ని ఖండించిన భారత ప్రభుత్వం.. అది పూర్తిగా తప్పుదోవ పట్టించేవార్త అని స్పష్టం చేసింది. ఇలాంటి సున్నిత సమయంలో మీడియా బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని