నందిగ్రామ్‌లో రాకేశ్‌ టికాయిత్‌ ! 

తాజా వార్తలు

Published : 14/03/2021 01:08 IST

నందిగ్రామ్‌లో రాకేశ్‌ టికాయిత్‌ ! 

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఇటీవల దీదీ గాయపడి ఆస్పత్రిలో చేరడం, సువేందు అధికారి Vs మమత మధ్య నందిగ్రామ్‌లో జరగబోయే రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ నందిగ్రామ్ వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. భాజపాకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఇటీవల రైతు సంఘాల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టికాయత్‌ శనివారం కోల్‌కతా చేరుకున్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ (మహా పంచాయత్‌)లో పాల్గొన్నారు. అక్కడి నుంచి నందిగ్రామ్‌ బయల్దేరే ముందు మాయో రోడ్డులో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను కలిశారు. నందిగ్రామ్‌లో మహాపంచాయత్‌లోనూ ఆయన ప్రసంగించనున్నారు. అలాగే, టికాయత్‌ సింగూరు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

మరోవైపు, కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు నాలుగు నెలలుగా కర్షకులు ఉద్యమిస్తున్నారు. కేంద్రంతో 11 దఫాలుగా చర్చలు జరిపినా ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఈ అంశంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో వేలాది మంది రైతులు దిల్లీ సరిహద్దుల్లోనే టెంట్‌లు వేసుకొని నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే, తమ ఆందోళనలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్లి తమ ఉద్యమ గొంతుకను వినిపించి, భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని