కొడుకు మృతదేహం కోసం.. తండ్రి అన్వేషణ

తాజా వార్తలు

Updated : 01/04/2021 14:48 IST

కొడుకు మృతదేహం కోసం.. తండ్రి అన్వేషణ

హృదయాలను కలచివేస్తున్న జవాను తండ్రి కథ

(రైఫిల్‌మన్‌ షకీర్‌ మంజూర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: చేతిలో పలుగు, పారతో రోజూ ఉదయాన్నే ఇంటి నుంచి బయల్దేరుతాడు ఆ తండ్రి. సమీపంలోని పొలాల్లో భూమిని తవ్వుతాడు. వ్యవసాయం చేసేందుకు కాదు.. మట్టిలో కలిసిపోయిన తన కన్నకొడుకు మృతదేహం కోసం..! అవును.. దేశరక్షణ కోసం సైన్యంలో చేరిన తన కుమారుడు ఉగ్రవాదుల చెరలో ప్రాణాలు కోల్పోతే.. జాలి, దయ లేని ముష్కరులు కనీసం శవాన్ని కూడా అప్పగించలేదు. కన్నకొడుకు కడచూపుకు కూడా నోచుకోని ఆ తండ్రి.. కనీసం మృతదేహం దొరికినా చాలనుకుని ఎనిమిది నెలలుగా భూమిని జల్లెడ పడుతూనే ఉన్నాడు. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన 56ఏళ్ల మంజూర్‌ అహ్మద్‌ వాగే కన్నీటి గాథ ఇది..

మంజూర్‌ అహ్మద్‌ వాగే కుమారుడు 24ఏళ్ల షకీర్‌ 2016లో భారత సైన్యంలోని టెరిటోరియల్‌ ఆర్మీలో రైఫిల్‌మన్‌గా చేరాడు. గతేడాది ఆగస్టు 2న ఈద్‌ను పురస్కరించుకుని సెలవుపై ఇంటికి వచ్చాడు. కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి సాయంత్రం తిరిగి ఆర్మీ క్యాంప్‌కు బయల్దేరాడు. షకీర్‌ను వాళ్ల కుటుంబ సభ్యులు చూడటం అదే చివరిసారి. ఆ తర్వాత గంటకు షకీర్‌.. ఇంటికి ఫోన్‌ చేసి తాను స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని, ఆర్మీ అధికారులు ఫోన్‌ చేసి అడిగితే కంగారుపడొద్దని చెప్పాడు. అతడి నుంచి వచ్చిన చివరి మాటలు కూడా అవే. ఆ మరుసటి రోజే కుల్గాం జిల్లాలో షకీర్‌ వాహనం మంటల్లో పూర్తిగా కాలిపోయి కన్పించింది. అతడిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అతడి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. 

సరిగ్గా వారం రోజుల తర్వాత మంజూర్‌ అహ్మద్‌ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో షకీర్‌ దుస్తులు కన్పించాయి. రక్తంతో తడిసిన ఆ దుస్తులను చూసి అహ్మద్‌ కుప్పకూలిపోయాడు. గుండెలవిసేలా రోదించాడు. షకీర్‌ను నలుగురు ఉగ్రవాదులు చిత్రహింసలు పెట్టడం తను చూశానని స్థానికంగా ఉండే ఓ మహిళ చెప్పింది. ఇవన్నీ చూశాక, తన కొడుకు బతికి ఉండే అవకాశం లేదని ఆ తండ్రికి అర్థమైంది. కనీసం మృతదేహాన్ని అయినా అప్పగించాలని అధికారులను వేడుకున్నాడు. కానీ, అది జరగలేదు. 

షకీర్‌ అదృశ్యమైన కొద్దిరోజుల తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఓ ఆడియో క్లిప్‌ వైరల్‌ అయ్యింది. ‘‘ఉగ్రవాదులను చంపేసిన తర్వాత వారి శవాలను ప్రభుత్వం అప్పగించట్లేదు. దానికి ప్రతీకారంగా మేం కూడా ఈ సైనికుడి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు ఇవ్వం’’ అన్నది ఆ ఆడియో క్లిప్‌ సారాంశం. దీంతో షకీర్‌ తండ్రి మళ్లీ పోలీసుల దగ్గరకు వెళ్లాడు. అయితే వారు మాత్రం షకీర్‌ది మిస్సింగ్‌ కేసుగానే నమోదు చేశారు. షకీర్‌ను ఎక్కడ సమాధి చేశారో తమకు తెలియదని, దానిపై తాము దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దీంతో కుమారుడి మృతదేహం కోసం తానే స్వయంగా అన్వేషణ మొదలుపెట్టాడు. ఘటన జరిగిన తర్వాత స్థానికులు చెప్పిన ఆధారాలతో తన గ్రామానికి సమీపంలో ఉన్న పొలాల్లో భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. గత ఎనిమిది నెలలుగా కొడుకు కోసం మట్టిని తవ్వుతూనే ఉన్నాడు.

‘‘మా ఇంటికి ఏడు కిలోమీటర్ల పరిధిలోనే తన శవాన్ని సమాధి చేసి ఉంటారని నా మనసు చెబుతోంది. కొడుకు ఎలాగూ దక్కలేదు. కనీసం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేస్తే అయినా వాడి ఆత్మకు శాంతి కలుగుతుందన్న చిన్న ఆశ. నేను అధికారులను కోరుకునేది ఒక్కటే.. నా కొడుకును ఎలాగూ కాపాడలేకపోయారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన షకీర్‌ను అమరుడిగా ప్రకటించండి చాలు..!’’అని గద్గద స్వరంతో కోరుతున్నాడా తండ్రి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని