‘సైకిల్‌ గర్ల్‌’ జ్యోతి తండ్రి కన్నుమూత
close

తాజా వార్తలు

Updated : 01/06/2021 14:34 IST

‘సైకిల్‌ గర్ల్‌’ జ్యోతి తండ్రి కన్నుమూత

పట్నా: గతేడాది లాక్‌డౌన్‌ వేళ గాయపడ్డ తండ్రిని వెనుక కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కి సొంతూరికి తీసుకొచ్చిన జ్యోతి కుమారి ప్రతి ఒక్కరికీ సుపరిచతమే. అయితే ఆమె సాహసం ఎంతోకాలం నిలువలేదు. ఏడాది తిరగకముందే జ్యోతి తండ్రి మెహన్‌ సోమవారం గుండెపోటుతో మరణించారు. మోహన్ మృతి పట్ల దర్భంగ జిల్లా అధికారులు సానుభూతి ప్రకటించారు. జ్యోతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు.

బిహార్‌లోని దర్భంగ జిల్లా సిర్హులి గ్రామానికి చెందిన మోహన్‌ పాస్వాన్‌ కుటుంబ పోషణ కోసం గురుగ్రామ్‌లో ఆటో నడిపేవారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. గతేడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు మోహన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని చూసుకునేందుకు పెద్ద కుమార్తె జ్యోతి కుమారి గురుగ్రామ్‌కు వచ్చింది. ఆ తర్వాత మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఈ తండ్రీకూతుళ్లు అక్కడే చిక్కుకుపోయారు. మోహన్‌ నడవలేని స్థితిలో ఉండటం, ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి లేకపోవడంతో యజమాని ఖాళీ చేయమని ఒత్తిడి తెచ్చాడు. పూట గడవడమే కష్టంగా మారింది. అలా దాదాపు నెలన్నర రోజుల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇక లాభం లేదనుకున్న జ్యోతి ఎలాగైనా తండ్రిని సొంతూరు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ, లాక్‌డౌన్‌తో వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేదు. దీంతో తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఓ పాత సైకిల్‌ కొని దానిపై తండ్రిని ఎక్కించుకుని దాదాపు 1200 కిలోమీటర్లు ప్రయాణం సాగించిందా బాలిక. ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఏడు రోజుల తర్వాత స్వగ్రామానికి చేరింది. జ్యోతి గురించి అప్పట్లో ‘సైకిల్‌ గర్ల్’ పేరుతో మీడియాలో కథనాలు రావడంతో దేశమంతా ఆమె పేరు మార్మోగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా కూడా బాలికను ప్రశంసించారు. 

జ్యోతి సాహసాన్ని దేశ ప్రజలతో పాటు భారత సైక్లింగ్‌ ఫెడరేషన్‌ కూడా గుర్తించి.. ఆమెకు సైక్లింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి బాలల పురస్కారాన్ని కూడా అందుకుంది. అంతేగాక, ఆత్మనిర్భర్‌ పేరుతో నిర్మిస్తున్న ఓ సినిమాలో జ్యోతి కథను కూడా తెరకెక్కిస్తుండగా అందులో తన పాత్రను తానే పోషిస్తోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని