అఫ్గాన్‌ నుంచి 50మంది అధికారుల తరలింపు

తాజా వార్తలు

Published : 12/07/2021 01:18 IST

అఫ్గాన్‌ నుంచి 50మంది అధికారుల తరలింపు

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని కాందహర్‌లో ఉన్న కాన్సులేట్‌ కార్యాలయం నుంచి 50 మంది భారతీయ అధికారులను కేంద్ర ప్రభుత్వం దిల్లీకి తీసుకొచ్చింది. అఫ్గాన్‌లోని పలు ప్రాంతాలను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకోవడం, అధికారులకు భద్రతా క్షీణిస్తున్న నేపథ్యంలో కాన్సులేట్‌ కార్యాలయంలోని వారిని తరలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. శనివారం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో వారిని దిల్లీకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. వీరిలో భారత దౌత్యవేత్తలు, సహాయక బృందంతోపాటు వారికి రక్షణగా ఉండే ఇండో-టిబెటిన్‌ బార్డర్‌ పోలీసులు ఉన్నారు. స్థానిక అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రస్తుతం కాన్సులేట్‌ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపింది. అఫ్గాన్‌లోని రాయబార కార్యాలయాన్ని మూసివేయట్లేదని.. అక్కడి అధికారులు పరిస్థితులను పరిశీలిస్తున్నారని భారత విదేశాంగ శాఖ ప్రకటించిన కొన్ని రోజులకే కాన్సులేట్‌ కార్యాలయం మూసివేయడం గమనార్హం.  

గత కొన్ని రోజులుగా అఫ్గానిస్థాన్‌ బలగాలకు, తాలిబన్లకు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో పలు ప్రాంతాలను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. కాందహర్‌లోకి కూడా ముష్కరులు ప్రవేశించారన్న వార్తలు రావడంతోనే భారత ప్రభుత్వం కాన్సులేట్‌ కార్యాలయం నుంచి సిబ్బందిని తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు తాలిబన్లతో కలిసి పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు కూడా దాడులకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని