No Jabs No Jobs: టీకా తీసుకోలేదా.. ఉద్యోగం ఊడినట్లే!

తాజా వార్తలు

Updated : 09/07/2021 12:55 IST

No Jabs No Jobs: టీకా తీసుకోలేదా.. ఉద్యోగం ఊడినట్లే!

డెల్టా వ్యాప్తితో.. ప్రజలకు ఫిజీ హెచ్చరిక

సువా: కొత్త కొత్త మ్యుటేషన్లతో కరోనా వైరస్ చూపిస్తోన్న ఉగ్రరూపానికి ప్రతిదేశమూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ ప్రభావాన్ని కొద్దిమేర అయినా తగ్గించేందుకు టీకాలు వేయించుకోవాలని ఆయా దేశాలు ప్రజలను కోరుతున్నాయి. అయితే టీకా గురించి పెద్దగా పట్టించుకోని వారి విషయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకునేందుకు పలు దేశాలు వెనుకాడటం లేదు. తాజాగా ఫిజీ ఆ తరహా నిర్ణయమే తీసుకుంది. ‘టీకాలు తీసుకోకపోతే, ఉద్యోగాలు ఉండవు’ అంటూ హెచ్చరించింది.

‘ప్రభుత్వ ఉద్యోగులంతా ఆగస్టు 15 నాటికి టీకా మొదటి డోసు తీసుకోకపోతే సెలవులో వెళ్లాల్సి ఉంటుంది. నవంబర్‌ ఒకటికల్లా రెండో డోసు వేయించుకోపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం. అలాగే ప్రైవేటు ఉద్యోగులు ఆగస్టు ఒకటికల్లా మొదటి డోసు వేయించుకోవాలి. లేకపోతే వ్యక్తిగతంగా భారీ జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుంది. సంస్థలు మూసివేసుకోవాల్సి వస్తుంది. టీకా తీసుకోకపోతే..ఉద్యోగాలు ఉండవు (NO JABS, NO JOBS)’ అంటూ ఫిజీ ప్రధాని ఫ్రాంక్‌ బైనిమారామా తీవ్ర హెచ్చరిక చేశారు.

ఒకవైపు డెల్టావేరియంట్‌తో సహా కొత్త రకాలు విజృంభిస్తుండగా.. కొవిడ్ నిబంధనల విషయంలో ప్రజల నిర్లక్ష్య వైఖరి ఫిజీ ప్రభుత్వాన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే కఠిన విధానాన్ని తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా ఏప్రిల్ వరకు ఫిజీలో వైరస్‌ సామాజిక వ్యాప్తి లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కానీ ఇప్పుడు అక్కడ నిత్యం 700కు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అందుకు డెల్టా వేరియంటే మూలకారణం. ఈ ఉద్ధృతితో అక్కడి వైద్యవ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మార్చురీలు నిండిపోవడంతో.. మృతదేహాలను తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులను వేడుకోవాల్సి వస్తోంది. ఈ సమయంలో లాక్‌డౌన్ విధించాలంటూ అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుండగా..ప్రధాని ఆ డిమాండ్‌ను తోసిపుచ్చారు. ‘లాక్‌డౌన్‌ కరోనాను చంపదని నిపుణులు చెప్పారు. కానీ అది ఉద్యోగాలు, దేశ భవిష్యత్తును చంపేస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

సుమారు 9 లక్షల మంది జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటివరకు దాదాపు 3,40,000 మంది వయోజనులు టీకా మొదటి డోసు వేయించుకున్నారు. వరల్డోమీటర్ గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో 8,600 కేసులు..48 మరణాలు సంభవించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని