Pfizer: త్వరలోనే భారత్‌లోకి..!
close

తాజా వార్తలు

Published : 22/06/2021 21:38 IST

Pfizer: త్వరలోనే భారత్‌లోకి..!

త్వరలోనే ప్రభుత్వంతో ఒప్పందం ఖరారు - ఫైజర్‌ సీఈఓ

దిల్లీ: ఫైజర్‌ టీకా వినియోగం కోసం భారత ప్రభుత్వంతో త్వరలోనే ఒప్పందం ఖరారు కానుందని ఆ సంస్థ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా వెల్లడించారు. దీంతో అత్యవసర వినియోగం కింద మరికొన్ని రోజుల్లోనే భారత్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ తుదిదశకు చేరుకుందని ఆల్బర్ట్‌ బౌర్లా మీడియాతో పేర్కొన్నారు.

భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు వినియోగంలో ఉన్నప్పటికీ వ్యాక్సిన్‌ల కొరత రాష్ట్రాలను వేధిస్తోంది. ఈ సమయంలో విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే విదేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు ఇక్కడ త్వరగా అనుమతులు ఇస్తామని ప్రకటించింది. భారత్‌లో ప్రయోగాలు జరపాల్సి ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సవరించింది. అయితే, భారత్‌కు టీకాలు సరఫరా చేశాక వాటిపై ఏమైనా న్యాయపరమైన చిక్కులు, నష్టపరిహారాల సమస్యలు (ఇండెమ్నిటి) వస్తే భారత ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఫైజర్‌ కోరుతోంది. ఇందుకు భారత ప్రభుత్వం కొంత వరకు హామీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో 95శాతానికి పైగా సమర్థత చూపిస్తున్నట్లు తేలింది. దీనిని మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఇది పూర్తిగా కొత్తది. అమెరికాలో భారీ ఎత్తున ఈ టీకాను వినియోగిస్తున్నారు. భారత్‌లో దాదాపు 5 కోట్ల డోసులు సరఫరా చేయడానికి ఫైజర్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితమే భారత్‌లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పలు సాంకేతిక, వాణిజ్య సమస్యలు ఫైజర్‌ ఆమోదానికి అడ్డంకిగా మారాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని