Centre to states: రెండో డోసుకే ప్రాధాన్యం ఇవ్వండి

తాజా వార్తలు

Published : 20/10/2021 01:07 IST

Centre to states: రెండో డోసుకే ప్రాధాన్యం ఇవ్వండి

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రెండో డోసు కవరేజీపైనే ఎక్కువ దృష్టిసారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం సూచించింది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రభుత్వం సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించింది. దేశంలో 100 కోట్ల టీకా డోసులు పంపిణీకి చేరువైన వేళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్లతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పౌరులకు టీకాలు ఇచ్చేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్న కృషిని రాజేశ్‌ భూషణ్ కొనియాడారు.

దేశంలో ఇంకా అనేక మంది రెండో డోసు తీసుకోలేదని మంత్రి ఈసందర్భంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే రెండో డోసుపై ఎక్కువ దృష్టిసారించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో టీకా డ్రైవ్‌ను పెంచాలని.. తక్కువ కవరేజీ  ఉన్న జిల్లాలను గుర్తించి అక్కడ కవరేజీ పెంచేందుకు చర్యలు చేపట్టాలని రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రజల్లో ఉండే అపోహలు తొలగించి, సమస్యలు పరిష్కరించి వారికి వ్యాక్సిన్లు అందించాలని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను పెంచేందుకు అవసరమైతే అదనంగా టీకాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అరుదైన రికార్డుకు భారత్‌ అడుగు దూరంలో ఉంది. దేశంలో ఇప్పటివరకు 99కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కూడా ట్విటర్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘99కోట్లు దాటాం. టీకా పంపిణీలో 100కోట్ల డోసుల మైలురాయి దిశగా భారత్ వేగంగా కదులుతోంది’ అని మాండవీయ ట్వీట్ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని