Pfizer: విదేశీ టీకాల రాకకు లైన్‌క్లియర్‌..!
close

తాజా వార్తలు

Updated : 02/06/2021 12:04 IST

Pfizer: విదేశీ టీకాల రాకకు లైన్‌క్లియర్‌..!

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో టీకాల కొరతను అధిగమించేదుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. విదేశీ టీకాలకు అనుమతి ప్రక్రియల్లో డీసీజీఐ మార్పులు చేసింది. విదేశాల్లో ఆమోదించిన టీకాలకు భారత్‌లో పరీక్షలు అవసరం లేదని తెలిపింది. కొన్ని దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన కొవిడ్‌19 టీకాలు భారత్‌లో బ్రిడ్జ్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా వెల్లడించింది.

డీజీసీఐ చీఫ్‌ వి.జి.సొమని రాసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘భారత్‌లో ఇటీవల కొవిడ్‌ వ్యాప్తి పెరిగిపోయింది. దీంతో టీకాల అవసరం తీవ్రంగా ఉంది. విదేశాల నుంచి టీకాల దిగుమతులను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అమెరికా ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే  ఎంహెచ్‌ఆర్‌ఏ, జపాన్‌ పీఎండీఏ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర అనుమతులు ఇచ్చిన టీకాల్లో మిలియన్ల కొద్ది ప్రజలు వినియోగించిన వాటికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చాం. అవి భారత్‌లో అనుమతుల కోసం కసౌలిలోని సెంట్రల్‌ డ్రగ్‌ లేబోరేటరీ బ్రిడ్జ్‌ ట్రయల్స్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదు. కాకపోతే దిగుమతి అయ్యే టీకాలు ఆయా దేశాల నేషనల్‌ కంట్రోల్‌ లేబరేటరీల ధ్రువీకరణను పొంది ఉండాలి’’ అని సొమని లేఖలో పేర్కొన్నారు.

గతంలో కొవిడ్‌ 19పై ఏర్పాటు చేసిన నేషనల్‌ ఎక్స్‌పర్ట్స్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ ఆడ్మిన్‌స్ట్రేషన్‌ ఈ మేరకు సిఫార్సు చేసింది. ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నాలు ఇండ్నెమ్నిటీ కోరడంతోపాటు.. స్థానికంగా ప్రయోగ పరీక్షలు చేపట్టకుండానే అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించాయి.  ఇతర దేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకొన్న సంస్థల టీకాలు భారత్‌లో ప్రవేశించాలంటే ఇక్కడ బ్రిడ్జ్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. దీని ద్వారా అవి భారతీయులపై ఎలా ప్రభావం చూపిస్తాయో విశ్లేషించేవారు.

ఇండెమ్నిటిపై కూడా సానుకూల వైఖరి

అత్యంత కీలకమైన ఇండెమ్నిటి విషయంలో ఫైజర్‌, మోడర్నాల అభ్యర్థనను ప్రభుత్వం సానుకూల వైఖరితో పరిశీలిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నా టీకాలకు ఇండెమ్నిటి ఇచ్చిన దేశాలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదన్న విషయాన్ని ప్రభుత్వం గమనించింది. ‘‘ఈ కంపెనీలు అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకొంటే వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ఆ వర్గాలు వెల్లడించాయి.

ఇండెమ్నిటి ఏమిటీ..?

ఈ సంస్థలు భారత్‌కు టీకాలు సరఫరా చేశాక వాటిపై ఏమైనా న్యాయపరమైన చిక్కులు, నష్టపరిహారాల అంశాలు వస్తే భారత ప్రభుత్వమే బాధ్యత వహించాలి.  సాధారణంగా టీకాలను విడుదల చేయడానికి ఏళ్లు పడతాయి. ప్రభుత్వాల ఒత్తిళ్ల కారణంగా హడావుడిగా టీకాలు విడుదల చేశారు. దీంతో జరగకూడని ఘటనలు జరిగితే రక్షణ కోసం ఆ సంస్థలు కోరుతున్నాయి. పైగా ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కొత్తది.

ఈ అంశానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘నో ఫాల్ట్‌’ పరిష్కారం చెప్పింది. కొవిడ్‌ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు  ఏమైనా ఉంటే బాధితులు కోర్టుకు వెళ్లకుండానే పరిహారం అందజేయాలని పేర్కొంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాలు ఇండెమ్నిటి, నోఫాల్ట్‌ అంశాలకు ఒప్పుకొన్నాయి. వీటిల్లో అమెరికా, ఐరోపా సంఘం, కెనడా, జపాన్‌, అర్జెంటీనా వంటి దేశాలు ఉన్నాయి. గావీ కోవాక్స్‌ అలయన్స్‌ కూడా దీనికి అంగీకరించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని