France: ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి చెంప దెబ్బ
close

తాజా వార్తలు

Updated : 08/06/2021 21:45 IST

France: ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి చెంప దెబ్బ

పారిస్‌: రాజకీయనాయకులు అనగానే.. అభివాదాలు, కరచాలనాలు సర్వసాధారణం. పర్యటనకు వెళ్లినప్పుడు ప్రజలకు అలా అభివాదాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. కానీ, పర్యటనకు వెళ్లిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. డ్రోమ్‌ ప్రాంతంలో వాహనం దిగి ప్రజలకు నమస్కరిస్తూ.. కరచాలనం చేసేందుకు  వస్తుండగా.. బారికేడ్లకు అవతలివైపు ఉన్న ఓ యువకుడు ఒక్కసారిగా ఆయన చెంపపై కొట్టాడు. దీంతో అధ్యక్షుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఇంతలో అక్కడున్న రక్షణ సిబ్బంది మెరుపు వేగంతో అధ్యక్షుడ్ని వెనక్కి తీసుకెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దాడికి పాల్పడిన యువకుడితోపాటు  మరొకరని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారిని ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు తెలిపింది. తాజా ఘటనపై ప్రధాని జీన్‌ కేస్టెక్స్‌ స్పందించారు. రాజకీయాలు హింసాత్మకంగా మారకూడదనీ, వ్యక్తిగత దూషణలకు, భౌతిక దాడులకు తావివ్వకూడదన్నారు.

వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మేక్రాన్‌ దేశ వ్యాప్తంగా పర్యటన ప్రారంభించారు. వచ్చే రెండు నెలల్లో 12 ప్రాంతాల్లో పర్యటించేందుకు అధికారులు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. అయితే రెండో పర్యటనలోనే ఇలా జరగడం గమనార్హం. ఈ ఘటన జరగడానికి కొద్ది సేపటి ముందే మేక్రాన్‌ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరుగుతున్న ఎన్నికల్లో అవకతవకలు జరిగే అవకాశముందని వామపక్ష నేత జీన్‌ లూస్‌ మెలెన్‌చాన్‌ చేసిన వ్యాఖ్యల అంతరార్థమేంటని ప్రశ్నించారు. తమ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని, శాంతి, సామరస్యాలను కోరుకుంటోందని అన్నారు. గత ఏడాది జులైలో సెంట్రల్‌ పారిస్‌లోని ఓ గార్డెన్‌లో నడుస్తూ వెళ్తుండగా..  మేక్రాన్‌ను ఉద్దేశించి కొందరు ఆందోళన కారులు అసభ్యంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని