జాబిల్లి ఆకర్షణకు కదిలొచ్చిన నౌకాసౌధం

తాజా వార్తలు

Updated : 30/03/2021 13:51 IST

జాబిల్లి ఆకర్షణకు కదిలొచ్చిన నౌకాసౌధం

ఎవర్‌ గివెన్‌కు ‘పున్నమి’ సాయం 

సూయిజ్‌: మనిషి మనుగడ ప్రకృతితో మమేకమై ఉందని మరోసారి రుజువైంది. మానవాళి ప్రయత్నాలతో పాటు ప్రకృతి సాయం తోడవడం వల్లే నౌకాసౌధం ‘ఎవర్‌గివెన్‌’ కదిలొచ్చింది. నిండు పున్నమి ప్రభావంతో కాలువలో ఎగిసిన అలలు.. ఇసుకలో కూరుకున్న నౌకను నీటిపైకి లేపాయి.

అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక జలమార్గమైన ఈజిప్టులోని సూయిజ్‌ కాలువలో ఇరుక్కుపోయిన భారీ కంటైనర్‌ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ ఎట్టకేలకు కదిలింది. ఇసుక తుపాను, బలమైన గాలుల కారణంగా గత మంగళవారం సూయిజ్‌ కాలువలో నౌక అడ్డం తిరిగి.. దాని ముందుభాగంలో ఉన్న కొమ్ము ఇసుక, బంకమట్టిలో కూరుకుపోయిన  విషయం తెలిసిందే. దీంతో నౌకను తిరిగి నీటిపైకి తెచ్చేందుకు ఆరు రోజులుగా చేసిన ప్రయత్నాలు సోమవారం ఫలించాయి. నౌక చిక్కుకున్న చోట ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్ల ద్వారా తవ్వుతుండగా.. టగ్‌బోట్లు నౌకను కదిలించాయి. వీటికి సముద్రపు పోటు కూడా తోడవడంతో అనుకున్నదానికంటే ముందుగానే ఎవర్‌గివెన్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాగలిగారు. 

అయితే నౌకను కదిలించే ప్రయత్నాల్లో పౌర్ణమి వల్ల ఏర్పడిన సముద్రపు పోటు అపారంగా సాయపడిందని సహాయక బృందాలు చెబుతున్నాయి. చంద్రుడి గురుత్వాకర్షణ వల్ల సముద్రంలో కెరటాలు, ఆటుపోట్లు ఏర్పడుతుంటాయి. సాధారణంగా పౌర్ణమి, అమవాస్య ఘడియల్లో అలల తీవ్రత విపరీతంగా ఉంటుంది. గత ఆదివారం పౌర్ణమి కావడంతో సూయిజ్‌ కాలువలోనూ అలలు పోటెత్తాయి. ఈ పోటు ఎవర్‌ గివెన్‌ నీటిలో నుంచి బయటకు వచ్చేందుకు సాయపడింది. ‘‘ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఏర్పడిన సముద్రపు పోటు మాకు అద్భుతమైన సాయం చేసింది. సముద్రపు పోటు నౌకకు బలంగా నెట్టింది. ఈ పోటు సమయంలో అలల శక్తి రెండు టగ్‌ బోట్లు లాగినంతదానికంటే ఎక్కువగా ఉంది’’ అని సహాయక బృందాలు తెలిపాయి. ఎవర్‌ గివెన్‌ మళ్లీ కదిలిందంటే దానికి జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి కూడా ఓ ప్రధాన కారణమేనని ఆ బృందాలు అంటున్నాయి. 

10 నిమిషాలు..టెన్షన్‌ టెన్షన్‌

అయితే నౌక నీటిపై తేలిన తర్వాత దాన్ని తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకురావడం కూడా చాలా కష్టమైందని రెస్క్యూ టీం సంస్థ బొస్కాలిస్‌ వెస్ట్‌మినిస్టర్‌ సీఈవో పీటర్‌ బెర్డోస్కీ అన్నారు. ‘‘ఓడ నీటిపై పూర్తిగా తేలిన తర్వాత టెన్షన్‌ మరింత ఎక్కువైంది. ఎందుకంటే ఎవర్‌గివెన్‌ కాలువకు ఉన్న మరో భాగానికి తాకకుండా టగ్‌బోట్ల సాయంతో దాన్ని నిలువుగా తీసుకురావాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. నౌకను సాధారణ స్థితికి తీసుకొచ్చే ఆ పది నిమిషాలు అందరిలోనూ టెన్షన్‌ ఎక్కువైంది’’ అని పీటర్‌ తెలిపారు. మొత్తానికి తమ ప్రయత్నాలు ఫలించి.. నౌక కాలువలో ముందుకు కదిలిందని చెప్పారు.

ఎవర్‌ గివెన్‌ కారణంగా సూయిజ్‌ కాలువలో వందలాది నౌకలు నిలిచిపోయాయి. ఇవన్నీ కాలువ దాటాలంటే కనీసం రెండున్నర రోజుల సమయం పడుతుందని, నాలుగు రోజుల తర్వాత జలమార్గం మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశాలున్నాయని కెనాల్‌ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలం నుంచి కదిలిన ఎవర్‌ గివెన్ తొలుత గ్రేట్‌ బిట్టర్‌ లేక్‌ యాంకర్‌ ప్రాంతానికి వెళ్లింది. అక్కడి నుంచి కాలువ దక్షిణ భాగంలోకి ప్రవేశించింది. దాని వెనుకే మిగతా నౌకలు కూడా తమ ప్రయాణాన్ని ఆరంభించాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని