ఇరాన్‌ అందుకే అంగీకరించిందా?

తాజా వార్తలు

Updated : 11/01/2020 15:02 IST

ఇరాన్‌ అందుకే అంగీకరించిందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేక కథనం: ఇటీవల తమ దేశ రాజధాని టెహ్రాన్‌లో విమానం కూలిన ఘటననను ప్రమాదంగా చిత్రీకరించేందుకు తొలుత ఇరాన్‌ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, చాలా ఆధారాలు వారి వాదనకు వ్యతిరేకంగా ఉండడం.. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో చివరకు పొరపాటును అంగీకరించక తప్పలేదు. విమానయాన సంస్థలు ప్రమాదాలను చాలా తీవ్రంగా పరిగణిస్తాయి. విమానాల తయారీలో ఒక్క స్క్రూ వదులుగా బిగించినా ప్రమాదం జరుగుతుంది. గతంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఫ్లైట్‌ 5390 విషయంలో ఇలానే జరిగింది. విమానం విండ్‌షీల్డ్‌కు పొరబాటున మరో స్క్రూ బిగించడంతో మార్గం మధ్యలో అది ఊడిపోయింది. దీంతో కెప్టెన్‌ను గాలి ఒత్తిడి బయటకు లాగేసింది. అందుకే విమానాల విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యాలకు కూడా తావివ్వరు. తాజాగా టెహ్రాన్‌లో ప్రమాదానికి గురైన విమానం సర్వీసింగ్‌ పూర్తయి నెల రోజుల లోపే అవుతోంది. దీంతో ఇంజిన్ విఫలం వల్ల ప్రమాదం జరిగి ఉండదని చాలా మంది బలంగా నమ్మారు. దీనికి మరిన్ని కారణాలు సైతం తోడయ్యాయి. దీంతో చివరికి తమ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఇరాన్‌ అంగీకరించాల్సి వచ్చింది.

బలమైన ఆధారాలివే... 

* ఒక ఇంజిన్‌ విఫలమైతే మరో ఇంజిన్‌ పనిచేస్తుంది. దీనివల్ల విమానం మరికొంత దూరం ప్రయాణిస్తుంది. ఒక్కసారిగా కూలిపోయే పరిస్థితి ఉండదు. రెండో ఇంజిన్‌ అందించే శక్తితో కొంత దూరం ప్రయాణించి బ్యాలెన్స్‌ కోల్పోయి ప్రమాదానికి గురవుతుంది. కానీ తాజా ఘటనలో అలా జరగలేదు. గాల్లోకి లేచిన కేవలం రెండు నిమిషాల్లోనే కూలిపోయింది.

* నిన్న విడుదలైన వీడియో తిరుగులేని ఆధారంగా నిలిచింది. గాల్లోకి లేచిన క్షిపణి ఒక వస్తువును ఢీకొన్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది. దీన్ని నిరాకరించడానికి ఇరాన్‌ వద్ద బలమైన వాదనలేకుండా పోయింది. పశ్చిమ టెహ్రాన్‌ నుంచి ఈ వీడియో తీసినట్లు తేలడంతో ఇది బలమైన ఆధారంగా నిలిచింది. 

*  సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగితే నేలను తాకిన తర్వాతే విమానం పేలిపోయే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. కానీ ఈ వీడియోలో విమానం గాల్లో కొంత ఎత్తులో ఉండగానే పేలినట్లు కనిపిస్తోంది. స్వల్ప పేలుడు జరిగి గాల్లోనే మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 

* విమాన శకలాలు చూస్తే ఇది ప్రమాదం కాదు కూల్చివేతే అని అర్థమవుతుంది. విమానం బయట భాగం శకలాలపై నల్లటి కాలిన మచ్చలు స్పష్టంగా ఉన్నాయి. విమానం బయట పేలుడు జరిగితేనే ఇలాంటి కాలిన మచ్చలు పడతాయి.

* విమాన శకలాల్లో మరో అంశం క్షిపణి దాడి విషయాన్ని స్పష్టం చేస్తోంది. శకలాల్లో చాలా భాగాలపై చిన్నచిన్న రంధ్రాలు పడి ఉన్నాయి. సాధారణంగా గగనతల రక్షణ వ్యవస్థలు వాడే క్షిపణులు దాడి చేస్తేనే ఇలాంటి రంధ్రాలు పడుతుంటాయి. ఆకాశంలో ఒక వస్తువును కచ్చితంగా ఢీకొనడం సాధ్యం కాదు కాబట్టి.. ఆ వస్తువు సమీపంలోకి వచ్చాక పేలేటట్లు వీటిని తయారు చేస్తారు. ఆ పేలుడుతో క్షిపణి నుంచి వెలువడే శకలాలు విమానాన్ని గుచ్చుకొని ఆ రంధ్రాలు పడ్డట్లు తెలుస్తోంది.

* ఉపగ్రహాల నుంచి వచ్చే సమాచారం కూడా దీనిలో కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికా వద్ద క్షిపణులను గుర్తించే ఉపగ్రహాలు ఉన్నాయి. ఇరాన్‌ వంటి సంక్షోభ ప్రదేశాల్లో వీటిని మోహరిస్తుంది. ఆ ప్రదేశం నుంచి క్షిపణి గాల్లోకి లేచిన వెంటనే అమెరికాకు సమాచారం వెళ్లిపోతుంది. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం.. క్షిపణులు గాల్లోకి లేచిన ప్రదేశం చాలా దగ్గరగా ఉండటం కూడా జరిగిన ఘటనను ధ్రువీకరిస్తున్నాయి.

* విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే గగనతల రక్షణ వ్యవస్థలో వాడే క్షిపణుల శకలాలు బయటపడ్డాయి. విమానాన్ని ఇరానే కూల్చినట్లు తిరుగు లేని ఆధారంగా నిలిచాయి.

 

* బ్లాక్‌బాక్స్‌లోని డేటా కూడా విమానంలో ఏం జరిగిందో తెలియజేస్తుంది. దీనిలోని వాయిస్‌ రికార్డర్లు విమానం కాక్‌పీట్‌లోని సంభాషణలను తెలియజేస్తాయి. ఇది కూడా విమానం బయట బలమైన పేలుడు జరిగిన విషయాన్ని తేలిగ్గా చెప్పేస్తుంది.

వాస్తవానికి బ్లాక్‌బాక్స్‌ ఇవ్వడానికి నిరాకరించినప్పుడే ఇరాన్‌ తప్పిదం తేటతెల్లమైంది. ఇక అత్యధిక మందిని కోల్పోయిన కెనడా.. తమ సాంకేతికతను పదునుపెట్టి నిజాన్ని ధ్రువీకరించుకొంది. మరికొన్ని దేశాల రాడార్లు సైతం క్షిపణి కదలికల్ని గుర్తించడంతో అసలు విషయం దాదాపు ఖరారైంది. ఇక తమ వాదన ఏమాత్రం చెల్లదని భావించిన ఇరాన్‌.. కాస్త ఆలస్యమైనా తప్పుని అంగీకరించక తప్పలేదు. తమ పొరపాటుని క్షమించరానిదిగా ఒప్పుకొని సమాజానికి క్షమాపణలు చెప్పింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని