శబరిమల వివాదంపై ప్రారంభమైన  విచారణ

తాజా వార్తలు

Updated : 13/01/2020 12:55 IST

శబరిమల వివాదంపై ప్రారంభమైన  విచారణ

దిల్లీ: శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ సందర్భంగా  ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం సిఫార్సు చేసిన అంశాలను పరిశీలిస్తున్నామని సీజేఐతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఈ ధర్మాసనం పరిశీలించనుంది. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేయనుంది.

న్యాయవాదులందరూ శబరిమల, ఇతర అంశాల గురించి కూలంకషంగా చర్చించుకొని ఓ నిర్ణయానికి రావాలని అందుకు వారందరికీ మూడు వారాల గడువు ఇస్తున్నట్లు సీజేఐ తెలిపారు. ఏ అంశంపై ఎలా వాదించాలనే దానిపై న్యాయవాదులందరూ ఒక నిర్ణయానికి రావడం వల్ల దీనికి సత్వర పరిష్కారం దొరుకుతుందని సీజేఐ అన్నారు. అయోధ్య కేసును అందుకు ఉదాహరణగా చూపించారు. సీనియర్‌ న్యాయవాదులు రాజీవ్‌ ధావన్‌, వైద్యనాథన్‌ అయోధ్య వాదనలకు సంబంధించి చర్చించుకున్నారని, దాన్ని మనం అనుసరిస్తే బాగుంటుందని న్యాయవాదులకు ఆయన సూచించారు. జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు, జస్టిస్‌ మోహన్‌ ఎం శాంతనాగోదర్‌, జస్టిస్‌ అబ్దుల్‌ మజీర్‌, జస్టిస్‌ సుభాష్‌ రెడ్డీ, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ ఈ ధర్మాసనంలో ఉన్నారు. మతపరంగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతకు సంబంధించిన పిటిషన్లను మూడు వారాల తర్వాత విచారణ చేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది. 

శబరిమలతో పాటు దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్సీ మహిళలకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడం వంటి అంశాలపై విచారణ జరపనుంది. అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించొచ్చంటూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై మిశ్రమ స్పందన వచ్చింది. దీనిపై రివ్యూ కోరుతూ 60కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని