ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాధికారం ఎవరిది?

తాజా వార్తలు

Updated : 21/01/2020 17:05 IST

ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాధికారం ఎవరిది?

‘స్పీకర్‌ కూడా ఓ రాజకీయ నాయకుడే కదా’ 

పునరాలోచించమన్న సుప్రీంకోర్టు 

దిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హత అంశంలో నిర్ణయాధికారం ఎవరికి ఉండాలి అన్నదానిపై పునరాలోచన చేయాలని సుప్రీంకోర్టు పార్లమెంట్‌ను అడిగింది. ప్రస్తుతం ఈ అధికారం స్పీకర్‌కు ఉన్నప్పటికీ ఆయన కూడా ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తే కదా అని అభిప్రాయపడింది. అలా కాకుండా ప్రజాప్రతినిధుల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు స్వతంత్ర, శాశ్వత యంత్రాంగం ఏర్పాటు చేసే విషయం గురించి పార్లమెంట్‌ ఆలోచించాలని సూచించింది. 

మణిపూర్‌ భాజపా మంత్రిపై అనర్హత వేయాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ అభిప్రాయాన్ని వెల్లడించింది. మణిపూర్‌ అటవీ శాఖ మంత్రి అయిన టీహెచ్‌ శ్యామ్‌కుమార్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం భాజపాలో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో శ్యామ్‌కుమార్‌పై అనర్హత వేయాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఫజూర్‌ రహీమ్‌, సీనియర్‌ నేత కె. మేఘచంద్ర సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. శ్యామ్‌కుమార్‌పై అనర్హత పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని మణిపూర్‌ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. గడువులోగా స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించేలా కాంగ్రెస్‌ నేతలకు స్వేచ్ఛ కల్పించింది. ఈ సందర్భంగా స్పీకర్‌ విచక్షణాధికారాలపై పునరాలోచన చేయాలని సర్వోన్నత న్యాయస్థానం పార్లమెంట్‌కు సూచించింది. ప్రజాప్రతినిధులపై వచ్చిన అనర్హత పిటిషన్లపై పారదర్శక ప్రక్రియ జరగాలంటే స్వతంత్ర యంత్రాంగం అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని