మరోసారి కోర్టుకెక్కిన నిర్భయ దోషులు

తాజా వార్తలు

Updated : 24/01/2020 17:51 IST

మరోసారి కోర్టుకెక్కిన నిర్భయ దోషులు

దిల్లీ: ఉరి శిక్ష తప్పించుకునేందుకు నిర్భయ దోషులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాల్సిందిగా ఇప్పటికే దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు రెండోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. మరణ శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే వాళ్లు క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్లు వేసుకొని సమయాన్ని వృథా చేయడంతో తొలిసారిగా ఇచ్చిన డెత్‌వారెంట్‌ గడువు ముగిసిపోయింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ డెత్‌వారెంట్‌ జారీ చేశారు. దోషులు దాన్ని కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్భయ దోషులు మళ్లీ కోర్టుకెక్కారు. 

పవన్‌, అక్షయ్‌ తరఫున న్యాయవాది ఏపీ సింగ్‌ దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. దోషులు క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను ఇవ్వడంలో తీహాడ్‌ జైలు అధికారులు ఆలస్యం చేశారని వారి తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నాడు. అందువల్లే ఆ ఇద్దరు దోషులు క్షమాభిక్ష పిటిషన్‌ వేసుకునేందుకు ఆలస్యమైందని న్యాయవాది ఆరోపించారు. దీనికి సంబంధించిన పిటిషన్‌ విచారణను దిల్లీ కోర్టు శనివారం చేపట్టనుంది. డెత్‌ వారెంట్‌ జారీ అయిన తర్వాత వీళ్లిద్దరూ ఇప్పటి వరకు క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయలేదు. గతంలో పవన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ వేసినట్లు వార్తలు వచ్చాయి.. కానీ అవి అసత్యమని తాను ఏ పిటిషన్‌ వేయలేదని అన్నాడు. 

ఇప్పటికే ముకేశ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. పిటిషన్‌ వచ్చిన నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రపతి దీన్ని తిరస్కరించి రికార్డు సృష్టించారు. ఇప్పటికే నిర్భయ దోషులకు ఉరి ప్రక్రియలో జాప్యం జరుగుతోందంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. మరణశిక్ష పడిన దోషులు తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేందుకు ఉన్న సమయాన్ని తగ్గించాలని కేంద్రం తన పిటిషన్‌ ద్వారా కోరింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని