6X8 గదిలో... ఆత్మహత్య చేసుకోకుండా...

తాజా వార్తలు

Updated : 25/01/2020 15:08 IST

6X8 గదిలో... ఆత్మహత్య చేసుకోకుండా...

నిర్భయ దోషులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత

తీహాడ్‌ జైలు.. మొత్తం 18,000 ఖైదీలు.. వీరిలో అత్యధిక భద్రత కల్పించింది ఎవరికో తెలుసా?.. ముంబయి గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌, దిల్లీ డాన్‌ నీరజ్‌ బవానా, బిహార్‌ నేరస్థుడు షహాబుద్దీన్‌.. వీరెవరికీ కాదు. ఫిబ్రవరి 1న ఉరితీయనున్న నిర్భయ దోషులు ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ కుమార్ గుప్తా (25), అక్షయ్‌ ఠాకూర్‌ (31), వినయ్‌ శర్మ (26)లకు.  వీరికి ఉరి శిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఆత్మహత్య చేసుకోకుండా...

నిర్భయ దోషులను తీహాడ్‌ జైలులోని మూడో నంబరు గదికి జనవరి 16న తరలించారు. 6X8 అడుగులున్న గదుల్లో ఒక్కొక్కరిని విడివిడిగా ఉంచారు. వారు ఆత్మహత్య చేసుకోకుండా నిరంతరం కాపలా కాస్తున్నారు. ఆ జైలుగదిలో ఏ విధమైన రెయిలింగ్‌లు, రాడ్లు ఉండవు. వీరున్న ప్రతి జైలు గది దగ్గర ఇద్దరు గార్డ్‌లు 24 గంటలూ కాపలా ఉంటారు. గదుల్లో అటాచ్డ్‌ టాయిలెట్స్‌ ఉన్నాయి. అక్కడ కూడా వారిపై నిఘా ఉంచేలా ఏర్పాట్లు ఉన్నాయి. వారి గదుల్లో నిషేధిత వస్తువులు ఉన్నాయా అని రోజుకు రెండు సార్లు గార్డులు పరిశీలిస్తారు. ఇవన్నీ కాకుండా ప్రతీ గదిలో రెండు సీసీ టీవీ కెమేరాలుంటాయి. జైలు సూపరింటెండెంట్‌ కార్యాలయంలోని కంట్రోల్‌ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. వారిని ప్రస్తుత గదులకు తరలించే ముందే దోషులు తమను తాము గాయపరచుకోవటానికి వీలు లేకుండా..  గదిలో గోడకు మేకులు, ఎలాంటి లోహపు వస్తువులు లేకుండా నిశిత పరిశీలన జరిగింది. 

పవన్‌ తప్ప మిగిలిన ముగ్గురూ...
‘‘దోషులు తమను తాము గాయపరుచుకోవడానికి తలను గోడకు కొట్టుకునే అవకాశం ఒక్కటే ఉంది. ఉరితీత అమలును వాయిదా వేయటానికి కొంతమంది ఇలా చేస్తారు. అయితే వీరు అలాచేస్తే సెకన్లలోనే  వారి ప్రయత్నాలను నిలువరించేలా ఏర్పాట్లు చేశాం. ఈ కేసులో మరో నిందితుడైన రామ్‌ సింగ్‌, మార్చి 11, 2013న ఇదే జైలు జనరల్‌ వార్డ్‌లోని 3వ నంబరు గదిలో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఉన్నత స్థాయి ఉద్యోగులకు ముప్పు వచ్చే అవకాశముంది.’’ అని సీనియర్‌ జైలు అధికారి ఒకరు తెలిపారు. ‘‘దోషులను ప్రతిరోజూ జైలు వైద్యులు పరిశీలించి హెడ్‌క్వార్టర్స్‌కు నివేదిక పంపుతారు. పవన్‌ తప్ప మిగిలిన ముగ్గురూ ఆందోళన చెందినట్టు కనపడలేదు. బహుశా ఉరితీత మళ్లీ వాయిదా పడుతుందని వారు అనుకుంటున్నారనుకుంటా. ఐతే పవన్‌ కుమార్‌ కొన్నిసార్లు ఆహారం తీసుకోవటం లేదు.’’ అని మరో అధికారి వివరించారు.

ఉరితీతపై దోషులు పెట్టుకున్న పిటిషన్లను దిల్లీ కోర్టు ఈరోజు కొట్టివేసింది. ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులను ఉరి తీయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని