రాజ్‌పథ్‌లో ట్యాంక్‌ కిల్లర్‌.. బాహుబలి 

తాజా వార్తలు

Updated : 26/01/2020 13:06 IST

రాజ్‌పథ్‌లో ట్యాంక్‌ కిల్లర్‌.. బాహుబలి 

హైవోల్టేజ్‌తో రిపబ్లిక్‌ డే పరేడ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆయుధాలు ఈ సారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కొలువుదీరాయి. అంతేకాదు ఎన్నో ప్రత్యేకతలు ఈ సారి కనువిందు చేశాయి. 71 ఏళ్ల చరిత్రలో తొలిసారి చోటుచేసుకొన్న ఘటనలకు ఇది వేదిక అయింది. రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణగా భావించే చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌)ను  ఏర్పాటు చేశారు. సరికొత్త ఆయుధాలు సైన్యం అమ్ములపొదిలోకి చేరాయి. 

మొదటి సీడీఎస్‌.. తొలి సారి యుద్ధస్మారకం వద్ద.. 

కార్గిల్‌ యుద్ధం తర్వాత ప్రతిపాదనగానే మిగిలిపోయిన సీడీఎస్‌ పదవి ఏర్పాటు ఈ ఏడాది సాకారమైంది. గత పంద్రాగస్టు నాడు ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఈ జనవరి 1వ తేదీన ఆచరణలోకి వచ్చింది. సైన్యాధిపతిగా పదవీ విరమణ చేసిన బిపిన్‌ రావత్‌ సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు.  ఈ సారి గణతంత్ర వేడుకల్లో త్రివిధ దళాధిపతులతో కలిసి సీడీఎస్‌ కూడా పాల్గొన్నారు.

ఇక అమర వీరులకు నివాళులర్పించే కార్యక్రమం ఈ సారి జాతీయ యుద్ధ స్మారకం వద్ద నిర్వహించారు. వాస్తవంగా దీనిని ఎప్పుడూ అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద నిర్వహించేవారు. కానీ, ఈసారి దీనిని గత ఏడాది ప్రారంభించిన నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ స్థూపం వద్ద నిర్వహించారు. ఇక్కడ ప్రధాని మోదీని తొలి మహాదళాధిపతి బిపిన్‌ రావత్‌ సాదరంగా ఆహ్వానించారు. 

దేశీయ గాండీవం.. ధనుష్‌ మెరుపులు..

దేశీయ బోఫోర్స్‌గా పేరున్న ధనుష్‌ శతఘ్నులను ఈ సారి రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రదర్శించారు. వీటిని దేశీయంగా గన్‌ క్యారేజ్‌ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. 1980లో బోఫోర్స్‌  కొనుగోలు సమయంలో చేసుకొన్న ఒప్పందం ప్రకారం భారత్‌కు తొలివిడతగా  12,000 పేజీల సాంకేతిక పరిజ్ఞానం అందింది. అదే ఆ తర్వాత మనకు ఆధారంగా మారింది.  అప్పట్లో బోఫోర్స్‌ వివాదం కావడంతో స్వీడన్‌ కంపెనీ 155x39 ఎంఎం సాంకేతికత అందలేదు. కానీ భారత సైన్యం అవసరాలు తీర్చేందుకు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు, డీఆర్‌డీవో, డీజీక్యూఏ, డీపీఎస్‌యూ, భారత్‌ ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌, సెయిల్‌తో పాటు పలు ప్రైవేటు సంస్థలు కలిసి తయారీని ప్రారంభించాయి. 

ధనుష్‌ ప్రాజెక్టు గన్స్‌ క్యారేజ్‌ ఫ్యాక్టరీ(జీసీఎఫ్‌)కి దక్కింది. తొలి నమూనాను 2014లో తయారు చేశారు. మొత్తం 11 నమూనాలను 4,200 రౌండ్ల మేరకు పరీక్షించారు. వీటిల్లో ఆమోదం పొందిన మోడల్‌ శతఘ్నలు భారత్‌లోని భిన్న వాతావరణాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అందుకే అత్యంత చలిగా ఉండే లేహ్‌, సిక్కిం, వేడిగా ఉండే ప్రదేశాలైన బాలాసోర్‌, బబీన, ఝాన్సీ, థార్‌ ఎడారిలోని పోఖ్రాన్‌ రేంజిలో పరీక్షించారు. దీనికోసం వాటిని 1600 కిలోమీటర్ల మేరకు తిప్పారు. ప్రపంచంలో అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదించే శతఘ్నుల్లో ధనుష్‌ కూడా స్థానం పొందింది. 

వ్యూహాత్మక ఆయుధాలు తరలించే బాహుబలి..

చినూక్‌ హెలికాప్టర్లు నేడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఠీవీగా దర్శనమిచ్చాయి. పర్వతాలతో కూడిన దుర్భేద్యమైన హిమాలయాల్లో ఆయుధాలను తరలించడం అత్యంత కష్టమైన పని.. ఈ నేపథ్యంలో 2015లో భారత్‌ 15 చినూక్‌ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది.  గతేడాది వీటిని భారత్‌కు తరలించి గుజరాత్‌లో అసెంబ్లింగ్‌ చేశారు. 
రెండు రొటేటర్లతో విభిన్నంగా  కనిపించే ఈ హెలికాప్టర్‌ చాలా శక్తిమంతమైంది. దాదాపు 10 టన్నులకు పైగా పేలోడ్‌ను ఇది తీసుకెళ్లగలదు. అంటే ఎం777 శతఘ్నులు, జీపులను  ఒక చోట నుంచి మరో చోటుకు తేలిగ్గా తరలించగలదు. సైనిక దళాలను వేగంగా పర్వతాలతో కూడిన సరిహద్దులకు చేర్చడానికి ఇటువంటి హెలికాప్టర్లు బాగా ఉపయోపడతాయి. ఎం777 శతఘ్నులను భారత సైన్యం చైనా సరిహద్దుల్లో మోహరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి చినూక్‌ రాకతో మరింత బలం చేకూరింది. ఇంధన సరఫరా, సహాయ కార్యక్రమాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఇప్పటి భారత వాయుసేనలో రష్యా తయారు చేసిన ఎంఐ26 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి కూడా అత్యంత శక్తిమంతమైనవి. ఇప్పటి వరకు భారత్‌ వీటినే హిమాలయ ప్రాంతాల్లో వినియోగిస్తోంది. శక్తి పరంగా చూసుకుంటే చినూక్‌  కంటే వీటి ఇంజిన్లు చాలా పెద్దవి. కానీ ఇదే పెద్ద లోపంగా మారింది. ఈ హెలికాప్టర్లు ఇంధనాన్ని విపరీతంగా వాడుకొంటాయి. ఖాళీ ఎంఐ 26 హెలికాప్టర్‌ బరువు దాదాపు 28 టన్నులు.. అదే సమయంలో చినూక్‌ ఖాళీ హెలికాప్టర్‌ బరువు 10 టన్నులు. దీంతో చినూక్‌కు ఇంధన వినియోగం కూడా చాలా తగ్గుతుంది. ఎంఐ26 హెలికాప్టర్ల శక్తిలో 15శాతం తోకభాగంలో  ఫ్యాన్‌ కారణంగా వృథా అవుతోంది. చినూక్‌లో ఈ సమస్యలేదు. అంతేకాకుండా ఎంఐ26 హెలికాప్టర్లు విడిభాగాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అందుకే భారత్‌ ప్రభుత్వం దీనివైపు మొగ్గు చూపింది.

గంభీరంగా ట్యాంక్‌ కిలర్లు..

అపాచీ హెలికాప్టర్లను ముద్దుగా ట్యాంక్‌ కిలర్లని పిలుస్తారు. ఇవి పూర్తిగా శత్రుసేనపై దాడి చేయడానికి మాత్రమే వాడతారు. దీనిలో ఇద్దరికి మించి సిబ్బంది పట్టరు. దీనిని ఒక రకంగా ఎగిరే యుద్ధ ట్యాంక్‌ అని చెప్పవచ్చు. దీనిని గత జులైలో సైన్యంలో ప్రవేశపెట్టారు.

బోయింగ్‌ సంస్థ ఇప్పటివరకు 2200 అపాచీ హెలికాప్టర్లను వేరు వేరు దేశాలకు అందించింది. ఈ తరహా చాపర్లను ఉపయోగిస్తున్న 16వ దేశం భారత్‌ కావడం విశేషం. 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని భారత వాయుసేన 2015లో కుదుర్చుకుంది. 2020నాటికి మొత్తం 22 హెలికాప్టర్లను భారత్‌కు బోయింగ్‌ అప్పగించనుంది. 

తొలిసారి సీఆర్‌పీఎఫ్‌ బైకర్స్‌..

సీఆర్‌పీఎఫ్‌ మహిళా బైకర్స్‌ బృందం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లపై చేసే విన్యాసాలు ఈ పరేడ్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తం 65 మంది సభ్యుల ఈ బైకర్స్‌ బృందం కొన్ని రోజులుగా రాజ్‌పథ్‌లో కఠోర సాధన చేసి దీనిలో పాల్గొంది. దాదాపు 90 నిమిషాలపాటు జరిగిన ఈ పరేడ్‌లో ఈ బృందం రాయల్‌ ఎన్‌పీల్డ్‌ 350 సీసీ బుల్లెట్‌ బైక్‌లపై విన్యాసాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో తొమ్మిది రకాల విన్యాసాలు చేశారు. ఈ బృందానికి 36 ఏళ్ల సీమా నాగ్‌ నేతృత్వం వహించారు. సీమా ప్రస్తుతం అల్లరి మూకలను అణచి వేసే ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. తన బృందం తరఫున ఈమే వీఐపీ సెల్యూట్‌ చేశారు.

ఏ శాట్‌ ఆకర్షణ..

శత్రుఉపగ్రహాలను పేల్చేసే ఏ శాట్‌ క్షిపణి ఈ సారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కనువిందు చేసింది. గత మార్చిలో విజయవంతగా భారత్‌ దీనిని పరీక్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రిపబ్లిక్‌ డే పరేడ్‌లో దీనిని ప్రదర్శించారు. యుద్ధాల్లో వినియోగించే గైడెడ్‌ బాంబులు, క్షిపణులు అన్నీ శాటిలైట్‌ ఆధారంగా తమ లక్ష్యాలను ఛేదిస్తాయి. ఉదాహరణకు భారత్‌పై ఏదైనా దేశం క్షిపణి ప్రయోగిస్తే.. భారత్‌ అప్రమత్తమై ఆ క్షిపణికి మార్గనిర్దేశకత్వం చేసే శాటిలైట్‌ను కూల్చివేసి ముప్పును తప్పించుకోవచ్చు. ఈ దెబ్బకు దాడి చేసిన దేశం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ అవసరాన్ని గుర్తెరిగి  ప్రత్యర్థి దేశాల శాటిలైట్లను కూల్చే సామర్థ్యాన్ని భారత్‌ కూడా సంపాదించింది.   కాకపోతే ఈ పరీక్షను భారత్‌ అత్యంత రహస్యంగా ఉంచింది. గతంలో చైనా ఈ పరీక్ష నిర్వహించినప్పుడు ప్రపంచ దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 

ఏశాట్‌ అంటే యాంటీ శాటిలైట్‌ అని అర్థం. దీనిని భూఉపరితలంపై నుంచికానీ, యుద్ధవిమానాల పై నుంచి కానీ ప్రయోగించే అవకాశం ఉంది. దాదాపు 2,000 కిలోమీటర్ల లోపు ఉన్న ఉపగ్రహాలను పేల్చివేసే సామర్థ్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది. భారత్‌ చేపట్టిన ‘మిషన్‌ శక్తి ’ చేపట్టిన ఆపరేషన్‌లో కేవలం మూడు నిమిషాల్లోనే భారత క్షిపణి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్‌ వద్ద ఉన్న ఏ క్షిపణిని అయినా మార్పులు చేసి ఏశాట్‌గా వాడొచ్చని డీఆర్‌డీవోకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. 
* 1985 సెప్టెంబర్‌ 13న యూఎస్‌ ఏఎస్‌ఎం-135 ఏశాట్‌ను ఎఫ్‌-15 ఈగిల్‌ నుంచి ప్రయోగించి ఒక ఉపగ్రహాన్ని కూల్చింది. ఇదే తొలి ఏశాట్‌ విజయంగా పరిగణిస్తారు. అదే సమయంలో సోవియట్‌ యూనియన్‌ కూడా ప్రయోగాలు చేపట్టింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని