ఉరి అమలుపై స్టే ఇవ్వండి: నిర్భయ దోషులు

తాజా వార్తలు

Updated : 30/01/2020 13:54 IST

ఉరి అమలుపై స్టే ఇవ్వండి: నిర్భయ దోషులు

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఉరి ఎప్పుడు పడుతుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం ఉరిని ఎలా ఆపాలా అని ప్రయత్నాలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో వారిని ఉరితీయాల్సి ఉండగా నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్‌ క్యురేటివ్‌ పిటిషన్‌ వేయగా వినయ్‌శర్మ క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వారి ఉరి మరోసారి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా గురువారం ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ నలుగురు దోషులు దిల్లీ పటియాలా హౌజ్‌ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దిల్లీ జైలు నిబంధనల ప్రకారం ఒకే నేరానికి పాల్పడిన నలుగురు ఖైదీలు తమకు ఉన్న క్షమాభిక్ష అభ్యర్థనతో సహా న్యాయపరమైన అన్ని హక్కులను ఉపయోగించుకునే దాకా ఉరి తీయకూడదని ఉందని వారి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ పిటిషన్‌లో పేర్కొన్నాడు. వారిలో కొంతమంది ఇంకా తమకు ఉన్న చట్టపరమైన అవకాశాలు వినియోగించుకోలేదని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ పిటిషన్‌ను ఈరోజు సాయంత్రం విచారిస్తామని కోర్టు తెలిపింది. 

నలుగురి దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ వేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని న్యాయవాది కోరారు. అక్షయ్‌ కుమార్‌ ఇప్పటికే సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ వేశాడు. దీనికి సంబంధించిన విచారణను మరికాసేపటిలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రత్యేక ఛాంబర్లో విచారించనుంది. ఫిబ్రవరి 1న నలుగురు దోషులను ఉరి తీయాల్సిందిగా దిల్లీ కోర్టు ఇటీవల రెండోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే దాన్ని ఆపేందుకు నలుగురు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణకు గురైన 14 రోజుల్లోపు దోషులను ఉరి తీయకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే వీరి ఉరితీత మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని